సూర్యాపేట
సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఓ ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్ ఘటన వెలుగుతోకి వచ్చింది. సీనియర్ల నుంచి తప్పించుకుని బాధిత విద్యార్ధి హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు ఫోన్ లో వివరించాడు. హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేట వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇంటి నుంచి జనవరి 1 రోజు రాత్రి హాస్టల్ కు చేరుకున్న అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు తమ గదిలోకి రమ్మని,అతడి దుస్తులు విప్పించి సెల్ ఫోన్లో వీడియో తీశారు.అప్పటికే మద్యం తాగి ఉన్న వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతనికి గుండు గీసెందుకు ప్రయత్నించారు. దీంతో సదరు విద్యార్థి వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం తనకు జరిగిన అవమానాన్ని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువకుడి తండ్రి 100 కు డైల్ చేసి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు 25 మంది సీనియర్లపై కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ అధకారులు కుడా స్పందించి విచారణ కమిటీని నియమించారు. జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు.