పేదకుటుంబాలకు చెందిన విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. సమర్ధవంతమైన విద్యతో పాటూ మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది సర్కార్. ఇక్కడి విద్యాబోధనతో పాటూ ఈ స్కూళ్లకు అనుబంధంగా ఉండే హాస్టళ్లల్లోనూ మెరుగైన వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. విద్యార్ధులకు మంచి చదువుతో పాటూ నాణ్యమైన ఆహారం అందించాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు విద్యార్థులకు ఇడ్లీ, చపాతీలతో పాటూ మాంసాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీటికి సంబంధించిన వంట పాత్రలు, యంత్రాల కొనుగోలు సక్రమంగా లేనట్లు కుమురం భీం జిల్లాలో రెండు నెలల క్రితమే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం వేసవి సెలవులు. మరో నెలరోజుల్లో పాఠశాలలు, వసతి గృహాలు తెరచుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే వంట పాత్రలు, గ్రైండర్లు ఇతర పరికరాలు కొనుగోలు చేయాలని విద్యార్ధి సంఘాల నేతలు సంబంధిత అధికార యంత్రాగానికి సూచిస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని, ఇప్పట్నుంచే ఈ పనిపై దృష్టి సారిస్తే.. పాఠశాలలను ప్రారంభమయ్యే నాటికి వస్తువులు సమకూరుతాయని చెప్తున్నారు.
వాస్తవానికి వంటపాత్రలు సరఫరా చేయాలంటూ గతంలోనే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ జిల్లా గిరిజన సంక్షేమ విభాగానికి సూచించింది. దీనికి కోసం నిధులు సైతం విడుదల చేసింది. అయితే జీసీసీ, జిల్లా గిరిజన సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పాత్రల కొనుగోలు ఆలస్యమవుతోందని సమాచారం. నిధులు మంజూరై చాలాకాలమే అయినా సంబంధిత అధికారులు పాత్రలు కొనుచేయడంలో కొంత అలసత్వం చూపారన్న విమర్శలున్నాయి. జిల్లాలో 46 గిరిజన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12,327 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వీరు ఉండే హాస్టళ్లలో వంట సామాగ్రి కొనుగోలుకు గతంలోనే రూ.14.50లక్షలు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లా మొత్తానికి రూ.45.10లక్షలు ఇచ్చారు. ఒక్క కుమురం భీం జిల్లాలోనే కాక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లోని పాఠశాలల్లో వంట సామాగ్రి పూర్తి స్థాయిలో లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సరైన వంట పాత్రలు లేకపోవడంతో గడిచిన విద్యాసంవత్సరంలో విద్యార్ధులకు డైట్ ఛార్ట్ సక్రమంగా అమలు కాలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. నిధులు ఎప్పుడో ఇచ్చినా వంట పాత్రలు కొనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి వంట పాత్రలు కొనుగోలు చేయాలని.. కనీసం వచ్చే విద్యాసంవత్సరంలో అయినా పిల్లలకు ప్రభుత్వ సూచించిన డైట్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.