కరీంనగర్ జనవరి 3
బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు సంజయ్‌తోపాటు మరో నలుగురికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ :
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు సోమవారం తిరస్కరించింది. బండి సంజయ్‌తోపాటు మరో నలుగురికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. బండి సంజయ్‌ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో బండి సంజయ్‌పై నమోదైన 10 కేసులను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.ఇదిలాఉండగా...
పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని గతంలో నమోదైన ఐపీసీ 353 సెక్షన్ కింద నమోదైన కేసులపై బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో జాగరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.కాగా లాఠీఛార్జీలు, తోపులాటలతో జాగరణ దీక్షాస్థలి అయిన ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్ దీక్షకు దిగగా.. రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సంజయ్ అక్కడే దీక్షకు దిగారు. ఉదయం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఎంపీ సంజయ్.. తిరిగి కరీంనగర్‌కు రాకముందే వందలాదిగా కార్యకర్తలు దీక్ష స్థలానికి చేరుకున్నారు. అయితే ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో సభకు అనుమతి లేదని, నిర్వహించవద్దని పోలీసులు ఉదయమే నోటీసులు జారీచేశారు. అయినా పెద్దయెత్తున కార్యకర్తలు దీక్షా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు.