శ్రీకాకుళం, జనవరి 4,
వైసీపీ గాలిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో టెక్కలి స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా.. ఆ పార్టీ కేడర్ మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ రాజకీయ ఎత్తుగడలకు అచ్చెన్నతోపాటు పార్టీ కేడర్ ఉక్కిరి బిక్కిరైన ఉదంతాలు ఉన్నాయి. ఈ కష్ట సమయంలో తమ ఎమ్మెల్యేను కలిసి బాధలు చెప్పుకొందామని టీడీపీ కేడర్ భావించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారని ఆనందించాలో.. తమకు పిలిస్తే పలికేంత దూరంలో లేరని బాధపడాలో అర్థం కావడం లేదని అంటున్నారు.ప్రస్తుతం టెక్కలిలో టీడీపీ కేడర్ చాలా ఇబ్బంది పడుతోంది. చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటికే పరిమితం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు రెండు సార్లు జైలుకెళ్లడంతో.. తమ నాయకుడికే ఇలా ఉంటే.. మన పరిస్థితి ఏంటి? అని ఆందోళన చెందారు. ప్రస్తుతం టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హవా నడుస్తోంది. ఇంతలో ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెన్న బిజీ అయిపోయారు. టెక్కలికి.. ఇక్కడ టీడీపీ కేడర్‌కు సమయం కేటాయించలేకపోతున్నారు. ఎక్కువ సమయం విజయవాడ లేదంటే విశాఖకే పరిమితం అవుతున్నారట అచ్చెన్నాయుడు.ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టెక్కలిలో అచ్చెన్న మార్కు కనిపించడం లేదన్నది కేడర్ చెప్పేమాట. జిల్లాలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా పార్టీ కేడర్‌కు సమయం కేటాయించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్న నుంచి అదే ఆశించిన టీడీపీ తమ్ముళ్లకు నిరాశ తప్పడం లేదని అంటున్నారు. తమ నేతను కలుసుకోవాలంటే విజయవాడ, లేదా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు కార్యకర్తలు. అందుకే మా అచ్చెన్న టెక్కలిని మర్చిపోయారని కేడర్ చెవులు కొరుక్కుంటోందట. నలుగురు కార్యకర్తలు కలిస్తే తమ బాధలు ఒకరికి ఒకరు చెప్పుకొని ఊరట చెందుతున్నారట.
మరి.. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు గమనించారో లేదో..?