కాకినాడ, జనవరి 4,
సీఎం. . ఈ పదం.. ఈ పదవి ఏపీ కాపులకు అందని ద్రాక్షా. ప్రతి పదేళ్లకోసారి ఆ వర్గం నుంచి ఓ నేత రాజకీయాల్లోకి రావడం .. ఫెయిల్ కావడం జరిగిపోయాయి. అదే ఇప్పుడు ఆ సామాజికవర్గంలో ఆందోళన కలిగిస్తోందట. చిరంజీవి.. పవన్ పొలిటికల్‌గా ఫెయిల్ అయ్యారు. ఇక మనకు రాజయోగం లేదా అనే ఆందోళనలో కొత్త వ్యూహంపై దృష్టిసారించారట.ఏపీలో కాపులు సంఖ్యా పరంగా పెద్ద సామాజికవర్గం. ఏదో ఒక పార్టీలో ఉంటూ.. రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులతో సరిపెట్టుకునేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆ సామాజికవర్గానికి ఆశ కలిగింది. అయితే చిరంజీవి నిలబడలేదు. 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా.. కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాపులు ఇబ్బంది పడ్డారు. తర్వాత వచ్చిన జనసేన అట్టర్‌ప్లాప్ అయింది. స్వయంగా పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఇది కాపు సామాజికవర్గాన్ని మరింత నిరాశపర్చింది. ఇప్పుడు ఎన్నికలైన రెండున్నరేళ్ల తర్వాత కాపులు మళ్లీ చర్చల్లోకి వచ్చారు. ఎక్కువ జనాభా ఉండి.. అధికారాన్ని అందుకోలేకపోతున్నామనే బాధ ఏమూలో దాగి ఉంది. రాజకీయంగా ఎదిగేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు ప్రారంభించారు. కాపు సామాజికవర్గంతో కలిసి వచ్చే కులాలను కలుపుకొని వెళ్లాలని అనుకుంటున్నారట. కమ్మేతర, రెడ్డేతర కులాలను ఏకం చేస్తే అధికారంలోకి రావడానికి శక్తి సరిపోతుందని లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.వివిధ పార్టీలలో ఉన్న కాపు సామాజికవర్గం నాయకులు ఈ దిశగా అడుగులు వేసి.. ఇటీవల హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు టీడీపీ నుంచి టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, వంగవీటి రాధాకృష్ణా, బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, కేవీరావు, జనసేన నుంచి తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, మేథావి వర్గం నుంచి జేడీ లక్ష్మీనారాయణ, పీవీ రావు, కాపు ఉద్యమ జేసీ నుంచి ఆరేటి ప్రకాష్, కాపు ఉద్యోగుల సంఘం నాయకుడు MHరావు తదితరులు హాజరయ్యారు. ఇతర కులాల ప్రముఖులతో మాట్లాడేందుకు నలుగురితో కమిటీ కూడా వేశారట. ఆ కమిటీలో తోట చంద్రశేఖర్, ఆరేటి ప్రకాష్ ఉన్నారు.రెండు రోజులు గ్యాప్ తీసుకుని హైదరాబాద్‌లోనే ఒక కాపు నాయకుడి ఇంట్లో మరో భారీ మీటింగ్ నిర్వహించారు. మరికొన్ని పార్టీలకు చెందిన కాపు నాయకులతోపాటు.. కాపు సామాజికవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలు ఆ మీటింగ్‌కు వచ్చారు. టీడీపీ, వైసీపీలు కాకుండా ప్రత్యామ్నాయ కూటమి రావాల్సి ఉందని కాపు కుల పెద్దలు అభిప్రాయపడ్డారట. అయితే భిన్నాభిప్రాయాలు కలిగిన పార్టీలలో ఉన్న కాపు నాయకులు ఎంత వరకు కలిసి సాగగలరు? ఈ స్థాయిలో కాకపోయినా గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అవి ఫలించలేదు. కానీ.. ఈసారి కాపు పారిశ్రామిక వేత్తులు, వివిధ పార్టీలలోని కాపు నాయకులు ఏకమై ఏదో చేయాలని అనుకుంటున్నారట.అయితే వివిధ పార్టీలలో ఉంటున్న కాపు నాయకులు.. ప్రత్యామ్నాయ కూటమిని ఎలా లీడ్ చేస్తారన్నది ప్రశ్న. ఒకవేళ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రకారం అజెండా అమలు చేయాలంటే గంటా, కన్నాలాంటి వాళ్లు తమ పార్టీలను వదిలి బయటకు రావాల్సి ఉంటుంది. కన్నా బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు బీజేపీ వదలి వస్తారా? అలా కానప్పుడు ప్రత్యామ్నాయ కూటమి వర్కవుట్ అవుతుందా అన్నది ప్రశ్న. హైదరాబాద్‌లో ఈ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో కిర్లంపూడిలో ముద్రగడతో కొందరు బీసీ, ఎస్సీ నేతలు సమావేశం అయ్యారు. అక్కడ కూడా కొత్త రాజకీయ కూటమిపైనే చర్చలు జరిగాయి. హైదరాబాద్, కిర్లంపూడి సమావేశాలకు సంబంధం లేదని కొందరు కాపు పెద్దలు చెబుతున్నా.. ఆ రెండుచోట్ల నుంచి వచ్చిన టోన్ ఒకేలా ఉంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీ నుంచి హైదరాబాద్‌లో కాపు మీటింగ్‌కు ఎవరైనా వచ్చారా లేదా అన్నది బయటకు చెప్పడం లేదు. మరి.. కాపు కుల పెద్దల నిర్ణయానికి వైసీపీలో ఉన్న కాపు నాయకులు రియాక్షన్ ఏంటి? పీఆర్పీ ప్రయోగం ఫలించక ఇబ్బంది పడ్డ సగటు కాపు సామాజికవర్గం.. కొత్త కూటమికి ఎంత వరకు ఆమోదం తెలియజేస్తుంది? వివిధ పార్టీలలో కొనసాగుతూనే నానాజాతి సమితిగా ముందుకెళ్తామంటే కొత్త ప్రయోగం వర్కవుట్ అవుతుందా అన్నది ప్రశ్నే. అలా కానప్పుడు తమ సామాజికవర్గాన్ని కాపు కాస్తారా లేక ఇంకేదైనా పార్టీకి కాపుకాస్తారో చూడాలి. మరి.. కాపు సామాజికవర్గ పెద్దలు హైదరాబాద్‌లో వేసిన అడుగులు..
ఏపీకి చేరేసరికి ఎలా ముందుకెళ్తాయో చూడాలి.