YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆగని ఇసుక అక్రమ రవాణా

 ఆగని ఇసుక అక్రమ రవాణా

కష్టపడి సంపాదించేకంటే.. కొందరు ఈజీ మార్గాల్లో ఆదాయం అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటివారిలో ఇసుకాసురులు మొదటిస్థానంలో ఉంటున్న దుస్థితి. తెలుగురాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల్లో ఇలాంటివారి ఆగడాలు అడ్డూఅదుపూలేకుండా సాగిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని హల్దీవాగునూ అక్రమార్కురుల కొందరు ఇలాగే సొమ్ము చేసుకుంటున్నట్లు ఇటీవలిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగించేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారని విరుచుకుపడుతున్నారు. అధికార యంత్రాంగం కన్నుగప్పి రాత్రికి రాత్రే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్తున్నారు. ఈదందాపై అధికారయంత్రాంగానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నా వారూ కొంత ఉదాసీనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిబ్బంది చూసీచూడనట్లు వదిలేయడం వల్లే ఇసుక దందా జోరుగా సాగిపోతోందని స్పష్టంచేస్తున్నారు. ఇదిలాఉంటే అక్రమ తవ్వకాల వల్ల స్థానికంగా భూగర్భ జలాలు ప్రభావితమవుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతుండడంతో సాగు-తాగు నీటికి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అంతా అంటున్నారు. 

 

హల్దీవాగు తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు సాధారణం. అయితే ఇటీవలిగా కొందరు వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. అనుమతులు లేకున్నా ఇసుకను పెద్దమొత్తంలో సేకరిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ అక్రమాల వల్ల వర్గల్‌, తూప్రాన్‌ తదితర మండలాల్లో పరిధిలో రూ.లక్షలు విలువ చేసే ఇసుక అన్యాక్రాంతమైపోయిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. క్వారీల్లో అనుమతి తీసుకొని అంతకు పదిరెట్లు ఇసుకను తీసుకుపోతున్నట్లు స్థానికులు స్పష్టంచేస్తున్నారు. ఈ దందాపై అధికారులు ఉదాసీనతంగా ఉండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని చెప్తున్నారు. ఇసుక కావాలని అడిగిన వారికి అనుమతులు ఇచేస్తున్న అధికారులు పర్యవేక్షణపై దృష్టి సారించడంలేదని దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి హల్దీవాగు వెంబడి సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు చెక్ పెట్టాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. అలా కాకుండా అక్రమార్కులను వదిలేస్తే హల్దీవాగు ఉనికే ప్రమాదంలో పడుతుందని, వేసవిలో నీటి కోసం మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని  హెచ్చరిస్తున్నారు.  

Related Posts