YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు

ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు

విజయవాడ, జనవరి 4,
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు ప్రీమియం కంపెనీల బ్రాండ్‌లను అమ్ముతామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పన్నుల పేరుతో ప్రజలను ఈ ప్రభుత్వం దోచుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. చివరకు చెత్తపైన కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇటీవల రాష్ట్రంలో గంజాయి సరఫరా ఎక్కువ కావడంతో డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితి నెలకొందన్నారు.మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తేదీ వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీకి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా భయపడుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపి ఎన్నికలు అయ్యాక జగన్ మాట మార్చారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై తాము రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టామని.. అమరావతిలో భవనాలన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారిపోయాయన్నారు. అమరావతిని విధ్వంసం చేయడం ద్వారా రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని మండిపడ్డారు.పోలవరంపై కాలయాపన చేసి రేట్లు పెంచారని… పోలవరం అసలు పూర్తవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయని… జాబ్‌లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను నిరుద్యోగుల పాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని.. బిల్లులు మంజూరు చేయకపోవడంతో రోడ్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన వైసీపీ పరిపాలన… ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారని చంద్రబాబు మండిపడ్డారు.

Related Posts