న్యూఢిల్లీ, జనవరి 5,
వైసీపీ... బీజేపీ వయా ఆర్ ఎస్ ఎస్ అంటోందా.. అంటూ ఔననే సమాధానం వస్తోంది.. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌రెడ్డి ఏ కేంద్ర పెద్దలనో కలవాలి కానీ.. అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్‌ను మీట్ కావడం కాకతాళీయం మాత్రం కాదు. ఇక ఇంకో ఫోటో.. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో దిగిన సెల్ఫీ. ఈ రెండూ మామూలు ఫోటోలు కానే కావు. వీటి వెనుక.. ఏవో కీలక రాజకీయ పరిణామాలకు తెరలేస్తోందనే అనుమానాలు. ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్‌ను జగన్ కలవడం. మోదీని కలిశారు, అమిత్‌షాను కలిశారు.. అంటే తనపై ఉన్న కేసుల గురించో, బెయిల్ గురించో అనుకోవచ్చు. లేదంటే, ప్రెస్‌నోట్‌లో ఉన్నట్టు ప్రత్యేక హోదానో, పోలవరం మేటరో కావొచ్చు. కానీ, రాంమాధవ్‌తో జగన్‌కు ఏం పని? వైసీపీ అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ లీడర్‌తో చర్చలు జరపాల్సిన అత్యవసరం ఏంటి? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక రాంమాధవ్ తక్కువోడేమీ కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి.. తిరిగి బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్‌కు షిఫ్ట్ అయిన బడా లీడర్. బీజేపీకి కశ్మీర్ ఇంఛార్జ్‌గా ఉంటూ.. ఆర్టికల్ 370 ఉపసంహరణలో కీలక రోల్ ప్లే చేశారు. రాష్ట్రపతి పాలనలో ఆ రాష్ట్రంలో బాగా పెత్తనం చేశారంటారు. ఆ పనైపోయాక రాంమాధవ్‌ను మళ్లీ ఆర్ఎస్ఎస్‌కు పంపించేశారు. ఇక, ఆ సమయంలో కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను.. ఆ తర్వాత మేఘాలయ గవర్నర్‌గా మార్చేశాక.. ఓ సంచలన ప్రకటన చేశారు. తన దగ్గరకు 2 ఫైళ్లు వచ్చాయని.. 300 కోట్ల లంచం ఆఫర్ చేశారని.. అందులో ఒకటి ఒక ఆర్‌ఎస్ఎస్ జెంటిల్మెన్ మధ్యవర్తిత్వంగా అనిల్ అంబానీ రిలయన్స్ డీల్ అని ఆరోపించడం కలకలం రేపింది. అయితే, గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఎక్కడా రాంమాధవ్ పేరు నేరుగా చెప్పకపోయినా.. రాంమాధవ్ మాత్రం ఆయన చేసిన ఆరోపణ తన గురించే అంటూ.. భుజాలు తడుముకుంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ సవాల్ చేశారు. మరి, అన్నట్టుగానే ఆయన లీగల్ యాక్షన్ తీసుకున్నట్టైతే ఎటువంటి సమాచారం లేదు. అంటే, అది ఉత్తుత్తి బెదిరింపేనా? గవర్నర్ సత్యపాల్ ఆరోపణలు నిజమేనా? అనే డౌట్. ఈ సత్యపాల్ మాలికే.. లేటెస్ట్‌గా మోదీ తనతో ఏరోగెంట్‌లా వాదించాడని.. ఆ విషయం చెబితే.. మోదీ లాస్ట్ హిస్ మైండ్ అని అమిత్‌షా అన్నాడని.. సంచలన కామెంట్లు చేశారు. అది వేరే విషయం అనుకోండి... మళ్లీ జగన్-రాంమాధవ్ భేటీకి వస్తే....వారం క్రితం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో విజయసాయిరెడ్డి సంభాషణ.. తాజాగా రాంమాధవ్‌తో జగన్ సమావేశం. ఈ రెండింటికీ లింకుందంటున్నారు. స్వతహాగా క్రిష్టియన్ అయిన జగన్‌రెడ్డిపై.. ఏపీలో ఆలయాలపై దాడులు, మత మార్పుడిలు జరగడంపై.. ఇటీవల ఆర్ఎస్ఎస్ పత్రిక 'ది ఆర్గనైజర్' తీవ్ర స్థాయిలో విమర్శనాత్మక కథనం ప్రచురించింది. కొంతకాలంగా స్వామీజీల దర్శనం, ఆలయాల సందర్శనం, బొట్లు, నామాలు, పూజలు, పంచకట్టుతో హిందుత్వవాదాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తూ.. అదే సమయంలో క్రిస్మస్‌నూ ఘనంగా జరుపుకుంటూ.. మతసహనాన్ని ప్రముఖంగా పాటిస్తున్న జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడిలా కరుడుగట్టిన హిందుత్వ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నేతలను ప్రసన్నం చేసుకునే పని చేస్తుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జగన్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వైపు నుంచి నరుక్కొచ్చే ఎత్తుగడ వేశారని అంటున్నారు. సీబీఐ కేసులు, బెయిల్ అంశం, కోర్టు తీర్పులు, ఏపీకి అప్పులు, రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలనే డిమాండ్లు, రాష్ట్రపతి పాలనపై లీకులు.. ఇలా అనేక కీలకాంశాల్లో కేంద్రం నుంచి, బీజేపీ పెద్దల నుంచి జగన్‌రెడ్డికి మొండిచేయి ఎదురవుతోందని తెలుస్తోంది. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి.. విన్నపాలు వినిపిస్తున్నా.. పెద్దల నుంచి మాత్రం అభయహస్తం అందడం లేదని అంటున్నారు. అందుకే, బీజేపీవాళ్లు ఎవరు చెబితే వింటారో.. ఎవరు ఆడిస్తే కేంద్రం ఆడుతుందో.. వాళ్ల దగ్గరి నుంచే నరుక్కొచ్చే ప్రయత్నంలో భాగంగానే.. ఇలా ఏ1, ఏ2లు ఆర్ఎస్ఎస్ ప్రదర్శన చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసే విజయసాయిరెడ్డి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా.. తెలుగువాడైన, ఢిల్లీలో మంచి పలుకుబడి ఉన్న రాంమాధవ్‌తో జగన్ భేటీ అయ్యారని అంటున్నారు. జగన్ వెనుకుండా ఓ స్వామీజీ జగన్నాటకం రక్తి కట్టిస్తున్నారని చెబుతున్నారు. ఆ పరిణామాలకు సాక్షమే.. ఈ రెండు ఫోటోలు అంటున్నారు. మరి, కోర్టుల విషయాల్లో కేంద్రం-బీజేపీ జోక్యం చేసుకోదు.. అవినీతికి, అవినీతిపరులకు ఆర్ఎస్ఎస్ ఆమడదూరం ఉంటుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాటిదే. విషనాగులు చుట్టుకున్న గంధపుచెట్టులా.. ఆర్ఎస్ఎస్ తన సచ్చీలత చాటుకుంటుందా?