తిరుమల, జనవరి 5,
ఏపీలోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర సర్కార్ లోన్ల విషయంలో పరిమితి విధించింది. వరదలతో వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా కేంద్ర పైసా సాయం కూడా విదల్చలేదు. తాజాగా టీటీడీకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. టీటీడీకి ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ రెన్యువల్ కాలేదు. దీంతో విదేశీ విరాళాల సేకరణకు టీటీడీకి బ్రేక్ పడింది. స్వచ్ఛంద, మతపరమైన సంస్థలకు విదేశీ విరాళాల వసూళ్లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ తప్పనిసరి... ఒక్క సారి దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఐదేళ్ల పాటు కొనసాగనుంది. ఈ కాల పరిమితి... 2020 డిసెంబర్ నాటికి టీటీడీ లైసెన్స్ గడువు ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏడాదిగా టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 18,778 సంస్థలకు లైసెన్స్ గడువు ముగిసింది. 12,989 సంస్థలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా... 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020 -21 ఏడాదిలో టీటీడీకీ విదేశీ విరాళాలు ఒక్క రూపాయి కూడా అందలేదు. గతంలో టీటీడీకి పెద్ద సంఖ్యలో విదేశీ భక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ప్రస్తుతం టీటీడీకి విదేశీ విరాళాల సేకరణకు పర్మిషన్ లేదు.దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టానికి (ఎఫ్‌సీఆర్‌ఏ) లోబడి ఈ లైసెన్సులు మంజూరవుతాయి. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. నియమ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. విదేశాల నుంచి పలు సంస్థలకు, సంఘాలకు అందుతున్న నిధుల్లో సింహభాగం దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో వీటిపై దృష్టి సారించింది. నిబంధనలు కఠినతరం చేయడంతో గత మూడు నాలుగేళ్లుగా ఈ తరహా లైసెన్సులు పొందుతున్న సంస్థలు, సంఘాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. టీటీడీ విషయానికొస్తే 2020 డిసెంబరులో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు గడువు ముగిసింది. దేవస్థానం అధికారులు సకాలంలోనే రెన్యువల్ కోసం దరఖాస్తు చేశారు. మారిన నిబంధనల నేపథ్యంలో కేంద్రం కోరిన వివరాలను పలు దఫాలుగా టీటీడీ అందజేసింది. సంబంధిత విభాగం అధికారులు మూడు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లొచ్చారు కూడా. కేంద్రం మళ్లీ పలు వివరాలు కోరడంతో చివరిసారిగా ఆరు నెలల కింద వాటినీ అందజేసి వచ్చారు. ప్రస్తుతం టీటీడీ రెన్యువల్ దరఖాస్తు కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. కాకపోతే ఏడాది గడిచినా లైసెన్సు పునరుద్ధరణకు మాత్రం నోచుకోలేదు. దీంతో టీటీడీకి విదేశాల నుంచి అందే విరాళాలు కూడా ఆగిపోయాయి. ఆ మేరకు ఓ ఏడాది పాటు విదేశీ విరాళాలను నష్టపోయినట్లయింది. ఇతర దేశాల్లో భక్తులు, సంస్థలు, సంఘాల నుంచి టీటీడీకి ఏటా ఎంత మొత్తంలో విరాళాలు అందుతాయనేది అధికారులు వెల్లడించడం లేదు. ఏటా రూ.50 కోట్లకుపైగా ఈ తరహా విరాళాలు అందుతాయని ప్రాథమిక అంచనా. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు రెన్యువల్ కాకపోవడంతో ఆ నిధులకు బ్రేక్ పడింది.