YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొత్త పార్టీ దిశగా ముద్రగడ అడుగులు

కొత్త పార్టీ దిశగా ముద్రగడ అడుగులు

కాకినాడ, జనవరి 5,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో ఏపీకి చెందిన కాపు ముఖ్య నేతలు పార్టీలకతీతంగా సమావేశమయ్యారు. కాపులకు అధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే దిశగా ఈ సమావేశంలో చర్చించారనే ప్రచారం బయటికి వచ్చింది. అంతకుముందు కొత్త పార్టీ పెట్టాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొన్ని వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయనే ప్రచారం జరిగింది. తాజాగా ముద్రగడ పద్మనాభం సంచలన లేఖతో బయటికి వచ్చారు. అధికారం కోసం బడుగులంతా ఏకం కావాలని అందులో ఆయన పిలుపిచ్చారు.కాపు, దళిత, బీసీ సామాజికవర్గాలను ఉద్దేశించి కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే కానీ, మన జాతులకు మాత్రం రాలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. తక్కువ జనాభా ఉన్న జాతులు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని... ఎక్కువ జనాభా ఉన్న మనం అధికారాన్ని ఎందుకు అనుభవించకూడదని ఆయన ప్రశ్నించారు. అధికారం ఇవ్వాలని అడిగితే ఇవ్వరని... అధికారాన్ని గుంజుకోవాలని అన్నారు.మన జాతులు పల్లకీలు మోయడానికే ఉన్నాయా? అని ముద్రగడ ప్రశ్నించారు. ఎంత కాలం పల్లకీలు మోయాలో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. పల్లకీలు మోయించుకుంటున్నవారు మన అవసరం తీరాక.. పశువుల కన్నా హీనంగా మనల్ని చూస్తున్నారని విమర్శించారు. మనం ఎప్పటికీ పల్లకీలో కూర్చోలేమా? అనే విషయం గురించి అందరూ ఆలోచించాలని చెప్పారు.  మన జాతులను బజారులో కొనుగోలు చేసే వస్తువులుగా పల్లకీలో కూర్చునేవారు భావిస్తున్నారని పద్మనాభం అన్నాపు.వారు చాలా ధనవంతులు, మన జాతులు గడ్డి పరకలు అనే భావన వారిదని విమర్శించారు. గడ్డి పరకకు విలువ ఉండదని... అయితే దాన్ని మెలివేస్తే ఏనుగును కూడా బంధిస్తుందని చెప్పారు.ఇతర బీసీ, దళిత నాయకుల సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దామని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎలాంటి ఆర్భాటాలు, హడావుడి లేకుండా... చాపకింద నీరులా, భూమిలోపల వైరింగులా మన కార్యాచరణ ఉండాలని చెప్పారు. మనం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేటు, జాగీరు కాదని అన్నారు. వారు ఎన్నేళ్లు అధికారం అనుభవించారో మనం కూడా అన్నేళ్లు అనుభవించాలని... దీన్ని సాధించేందుకు మన జాతుల పెద్దలందరం తరచుగా మాట్లాడుకుని మంచి ఆలోచన చేద్దామని కోరారు.ముద్రగడ కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం సాగుతున్న సమయంలో.. ఆయన బహిరంగ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీపై త్వరలోనే ముద్రగడ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందనే చర్చ జరుతుతోంది.  

Related Posts