YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెక్కీ హడావిడి... ఇప్పుడు అదేం లేదంటూ కామెంట్

రెక్కీ హడావిడి... ఇప్పుడు అదేం లేదంటూ కామెంట్

విజయవాడ, జనవరి 5,
స్వర్గీయ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కీ జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం.. అనంతరం విజయవాడ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ క్రమంలో వైయస్ జగన్ ప్రభుత్వం స్పందించిన తీరు.. విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వయంగా రాధా ఇంటికి వెళ్లి.. వాకాబు చేయడం...  ఆ తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే..వంగవీటి రాధా హత్యకు రెక్కీ ఎపిసోడ్ కథ కంచికేనా? అని భావించాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎక్కడా.. ఎటువంటి ఆధారాలు లభించలేదంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా చేసిన తాజా వ్యాఖ్యలపై వారు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వంగవీటి రాధా తన హత్యకు రెక్కీ జరిగిందంటూ ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని వారు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
డిసెంబర్ 26వ తేదీ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం.. చిన్న గొన్నూరులో తన తండ్రి వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా.... తన హత్యకు రెక్కీ జరిగిందంటూ .. మంత్రి కోడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే విజయవాడ నగర పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని.. ఆ క్రమంలో గుణదల గ్యాంగ్‌లోని కీలక నేత అరవ సత్యంను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆయన స్పృహ కోల్పోయారని.. దీంతో ఆయన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. మరోవైపు డిసెంబర్ 27వ తేదీ ఉదయం.. అరవ సత్యం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని. .. దీంతో ఆయన్ని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా చెబుతున్నారు. ఇంకోవైపు వంగవీటి రాధాకు వైయస్ జగన్ ప్రభుత్వం భద్రత కల్పించడం.. తనకు భద్రత అవసరం లేదంటూ వంగవీటి రాధే స్వయంగా భద్రత సిబ్బందిని వెనక్కి పంపించేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంలో జగన్ ప్రభుత్వ బాధ్యత తీరిపోయిందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఎప్పుడు జరిగింది.. అనే అంశాన్ని ఈ జగన్ ప్రభుత్వం ఆరా తీయకపోవడంపై పలు అనుమానాలు  వ్యక్తమవుతున్నాయంటున్నారు. వంగవీటి రాధాతో ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మంచి స్నేహమే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్న విషయం.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలుసుకున్నారు. ఆ క్రమంలో వంగవీటి రాధాతో ఆ ప్రయత్నాన్ని ఆపేంచేందుకు ఆగమేఘాల మీద వైయస్ జగన్.. రంగంలోకి దిగి రాధాకు స్వయంగా ఫోన్ చేశారని.. అందుకు వంగవీటి రాధా ససేమీరా అనడంతో.. ఆ వెంటనే పార్టీలోకి ఓ కీలక నేతను సైతం వంగవీటి రాధా వద్దకు వైయస్ జగన్ స్వయంగా పంపారంటూ నాడు మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. మరి వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కీ జరిగిందంటూ వ్యాఖ్యలు చేస్తే.. ఈ వైయస్ జగన్ ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఇదేనా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ అంశంలో నగర పోలీసుల వ్యవహార శైలిలోపై కూడా వారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వంగవీటి రాధా వద్దకు పోలీసులను పంపిచామని.. ఈ అంశంపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేమని..స్వయంగా నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పేర్కొనడం హాస్యాస్పందంగా ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం నగరమైనా, పల్లెటూరు అయినా.. సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంటున్నాయన్నది అందరికీ తెలిసిందే. ఒక్క సీసీ కెమెరా.. వంద మంది పోలీసులకు పెట్టు అంటూ డిపార్టమెంట్‌లోని డీజీపీ స్థాయి అధికారి గతంలో వెల్లడించిన విషయాన్ని విధితమే. మరి ఆ దిశగా నగర పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించలేదా?.. ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు.. ఈ రెక్కీకి సంబంధించి.. ఎవరో ఒకరు అనుమానాస్పదంగా.. రాధా నివాసం వద్ద కానీ.. ఆయన కార్యాలయం వద్ద కానీ సంచరించి అవకాశాలు ఉన్నాయని.. మరి ఈ విషయాన్ని విజయవాడ నగర పోలీసులు గుర్తించలేకపోయారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదీకాక.. నగరంలోని ఓ డివిజన్ కార్పొరేటర్.. అదీ అధికార పార్టీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యం.. వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కీ అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అనారోగ్యం అంటూ ఆసుపత్రిలో చేరడం.. పలు అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు. విచారణ అంటే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి.. అలా అయితేనే అసలు దోషులు ఎవరో తెలిపోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.  కానీ వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంలో కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని.. మరి కొన్ని అంశాలు గాలికీ వదిలేశారంటూ నగర పోలీసుల వ్యవహార శైలిపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా పోలీసులు తలుచుకుంటే.. ఎటువంటి కేసునైనా.. చిటెకలో ఛేదిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఛేదించిన కేసులు .. ఆంధ్రప్రదేశ్‌లో కొకొల్లలుగా ఉన్నాయి. కానీ పెద్దల నుంచి.. పై నుంచి ఒత్తిడి.. వస్తే.. ఏ కేసు అయినా.. ఎలాంటి కేసు అయినా కథ కంచికి చేరడం మాత్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి.. వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కీ అంటూ చేసిన వ్యాఖ్యలుపై విచారణ.. దర్యాప్తు అంశాన్ని విజయవాడ నగర పోలీసులు తమదైన శైలిలో కథ కంచికి చేర్చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు

Related Posts