YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో మీటర్ల రచ్చ

 వైసీపీలో మీటర్ల రచ్చ

నెల్లూరు, జనవరి 5,
ఏపీలో కరెంట్ భారం పెంచేందుకు రంగం సిద్ధం అవుతోందా? ఒక ఇంటికి ఒకే మీటర్‌ పెట్టాలనే నిబంధన అమలుపై ఏపీ రంగం సిద్ధం చేస్తోందా? దీనికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. అయితే ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఇంటికి ఒకటే మీటర్‌ పెట్టుకోవాలని.. మిగిలిన వాటిని తొలగించే దిశగా ప్రభుత్వ సూచనల మేరకు ఇంధన శాఖ రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ఇంటికి ఒకటే మీటర్‌ అంటే పేద, మధ్య తరగతి ప్రజల నెత్తిన భారీగా భారం పడడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమైంది. ఇంటికి ఒకటే మీటర్‌ అమరిస్తే.. మూడు, నాలుగేసి పోర్షన్లకు సంబంధించిన బిల్లు ఒక దానిపై వస్తే టారిఫ్‌ పెరిగిపోయి.. విద్యుత్‌ బిల్లులు రెండింతలు అవుతాయనేది చాలా మంది వాదన.ఈ క్రమంలో ఇంటికో మీటర్‌ విధానం అంటే పోర్షనుకో మీటర్‌ పెట్టుకోవాలనే నిబంధనను తాము అమలు చేయాలని భావిస్తున్నట్టుగా ఇంధన శాఖ చెబుతోంది. ఇంటికో మీటర్‌ వేరు.. పోర్షనుకో మీటర్‌ వేరు అని.. రెండింటిని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. కొంత మంది తాము చేస్తున్న విద్యుత్‌ వినియోగానికి తగ్గ బిల్లులు చెల్లించకుండా ఉండేందుకు.. హై టారిఫ్‌ నుంచి తప్పించుకునేందుకు రకరాకల గిమ్మిక్కులు చేస్తున్నారనేది అధికారుల ఆరోపణ. కొంత మంది వినియోగదారులు ఒక పోర్షన్‌కు ఒకటికి మించి మీటర్లు బిగించుకున్నారని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. ఏసీలు, గీజర్లు వంటి వాటి కోసం ప్రత్యేకంగా మీటర్లు బిగించుకోవడం వల్ల తక్కువ టారిఫ్‌లో బిల్లులు చెల్లించే వెసులు బాటు తీసుకుంటున్నారంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఇదే రుజువైనట్టు తేలింది.ఈ క్రమంలో ఒకే మీటర్‌ విధానాన్ని అమలు చేయాలని.. అయితే ఇది ఇంటికి కాదని.. పోర్షన్‌కు మాత్రమేననేది ఇంధన శాఖ వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ విధానానికి కొంత వరకు బ్రేకులు పడ్డా.. వాస్తవాలు వివరించి.. నెమ్మదిగా ఒకే మీటర్‌ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. టారిఫ్‌ తగ్గించుకునేందుకు ఒకటికన్నా ఎక్కువగా మీటర్లు పెట్టుకున్నవారి చిట్టా లాగే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఇలా మొత్తం డాటా సేకరించి. .. తర్వాత నెమ్మదిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది.

Related Posts