హైదరాబాద్, జనవరి 5,
వెరీ సింపుల్. చాలా క్లియర్ కట్‌గా తెలిసిపోతోంది. రేవంత్‌రెడ్డి రచ్చబండకు వెళతానంటే హౌజ్ అరెస్ట్ చేశారు. రైతు పరామర్శకు పోతానంటే ఇంట్లోనే అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి న్యూస్‌లో లేకుండా.. ఎలాంటి హడావుడి క్రియేట్ కాకుండా.. స్మూత్‌గా, సైలెంట్‌గా హ్యాండిల్ చేసింది తెలంగాణ సర్కారు. కానీ, అదే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఉపాధ్యాయులకు మద్దతుగా జీవో 317 రద్దు కోసం జాగరణ దీక్ష చేస్తానంటే రచ్చ రంబోలా చేశారు. ముందుగానే ప్రకటించిన షెడ్యూలే కదా.. రేవంత్‌రెడ్డిలానే బండి సంజయ్‌నూ హౌజ్ అరెస్ట్ చేసుంటే సరిపోయేదిగా? ఇంత హంగామా జరిగేది కాదుగా? మరి, ఇంత చిన్న లాజిక్ ప్రభుత్వానికి-పోలీసులకు తెలీదనుకోవాలా? లేక, అంతా తెలిసే.. కావాలనే.. ఇలా చేశారా? అనే చర్చ జరుగుతోంది. ఆదివారం రాత్రి కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత. పోలీసుల కన్నగప్పి బండి సంజయ్ ఆఫీసు గేట్లకు తాళాలేసుకొని దీక్షకు దిగారు. చుట్టూ అనుచరులతో రక్షణ వలయంలో దీక్ష చేపట్టారు. పోలీసులు ఆపరేషన్ అటాక్ చేపట్టారు. తాళాలు పగలగొట్టి.. గేట్లు కట్ చేసి.. ఫైర్ ఇంజిన్‌తో నీళ్లు చల్లి.. లాఠీఛార్జి చేసి.. నానా రచ్చ క్రియేట్ చేసి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. జాగరణ దీక్షను భగ్నం చేశారు. ఇక అంతే. మీడియాలో తెగ హంగామా. పోలీస్ యాక్షన్, బండి అరెస్ట్‌లపై గంటల కొద్దీ టీవీ ఛానెళ్లు ఊదరగొట్టారు. సోమవారం కూడా ఇవే వార్తలు. సంజయ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెడతారంటూ లీకులు. దీక్ష భగ్నమైనా.. అంతకంటే ఎక్కువే ప్రచారం వచ్చిందంటున్నారు. దీక్ష చేసుంటే మరీ ఇంతలా హైప్ వచ్చేది కాకపోవచ్చు. బండి తన మానాన తాను రాత్రంతా జాగరణ చేసి.. ఉదయాన్నే విరమించి.. తనింటికి తాను వెళ్లిపోయేవాడు. ఏదో రొటీన్ న్యూస్‌లా కవరేట్ వచ్చేది. కానీ, పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయడం వల్లనే.. అది గంటల తరబడి బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. రేవంత్‌రెడ్డికి రాని మైలేజ్.. బండి సంజయ్‌కు వచ్చేసింది. ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేది.. పోలీసులతో తలపడేది.. కేసీఆర్ భయపడేది.. బండి-బీజేపీనే అంటూ ప్రజల్లోకి మెసేజ్ వెళ్లాలనే ఇంత సీన్ అయ్యేలా చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఎక్కడా హైప్ రాకుండా.. జాగ్రత్తగా బండిని, బీజేపీని న్యూస్‌లో ఉంచుతున్నారని.. ఇదంతా కేసీఆర్ పొలిటికల్ గేమ్ అంటున్నారు. కేసీఆర్‌ను గద్దె దించే సత్తా.. కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికే ఉందని గ్రహించే.. హస్తం పార్టీ-రేవంత్‌రెడ్డి ఎదగకుండా చేసేందుకే.. బీజేపీని, బండి సంజయ్‌ను ఫుల్‌గా ప్రమోట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆ రాజకీయ వ్యూహంలో భాగంగానే.. కేసీఆర్ కావలనే వరి కొనుగోళ్ల అంశాన్ని ఇష్యూ చేశారని.. పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి బండి సంజయ్‌ను, బీజేపీని కవ్వించారని.. అలా ఓ నెలా-రెండు నెలల పాటు రేవంత్‌రెడ్డిని సైలెంట్‌మోడ్‌లోకి నెట్టేశారని అంటారు. అయితే, పార్లమెంట్ సమావేశాలు ముగియగానే రేవంత్‌రెడ్డి మళ్లీ యాక్టివ్ కావడం.. ఎర్రవల్లిలో రచ్చబండ, ఆత్మహత్య చేసుకున్న రైతు పరామర్శ ప్రొగ్రామ్స్‌తో లైమ్‌లైట్‌లోకి రావడంతో.. కేసీఆర్ మళ్లీ అలర్ట్ అయ్యారని.. అంతలోనే అందివచ్చిన అవకాశంగా.. బండి సంజయ్ జాగరణ దీక్షను వాడుకున్నారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ స్కెచ్ ఆయకే బూమరాంగ్ అవుతుందా? బీజేపీ బాగా బలపడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేదా? ఇక, రేవంత్‌రెడ్డి దూకుడును అడ్డుకోవడం అంత ఈజీనా? అంటున్నారు.