హైదరాబాద్, జనవరి 6,
కేసీఆర్‌ను కొందరు పిట్టలదొర అంటూ విమర్శిస్తుంటారు. చెప్పేవి ఎక్కువ.. చేసేవి తక్కువ అని తప్పుబడుతుంటారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. మభ్యపెట్టడంలో ఆయన ఎక్స్‌పర్ట్ అని చెబుతుంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రం.. దేశంలో మనమే నెంబర్ వన్.. అంటూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఊదరగొడుతుంటారు. అందుకు తగ్గట్టే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెంచేశారు. పింఛన్లు, రైతుబంధు, దళితబంధు అంటూ పైసలు విచ్చలవిడిగా పంచేస్తున్నారు. ఎందుకంత అంటే.. మనది ధనికరాష్ట్రం ఆమాత్రం ఉండొద్దా? అంటూ రివర్స్ అటాక్ చేస్తుంటారు. స్వయానా ముఖ్యమంత్రే పదే పదే రిచ్ స్టేట్ అంటూ చెప్పడంతో.. ప్రజలంతా నిజమే కావొచ్చు.. తెలంగాణ ధనిక రాష్ట్రం కావొచ్చు.. అని అంతా అనుకున్నారు. కానీ, అందులో అసలేమాత్రం నిజం లేదని.. అదంతా కేసీఆర్ కల్పించిన భ్రమ అని నీతిఆయోగ్ తాజా నివేదిక తేల్చి చెప్పింది. కేసీఆర్ నోటికి తాళాలు వేసే విధంగా ఆ రిపోర్ట్ ఉంది. ఇన్నాళ్లూ అరచేతిలో స్వర్గం చూపించారని.. తెలంగాణకు అంత సీన్ లేదని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇప్పటికే అప్పులపాలై, దివాళా తీసిన ఏపీకంటే.. తెలంగాణనే పేద దేశమని లెక్కలతో సహా చెప్పేసింది నీతిఆయోగ్. 2015-16 జాతీయ సర్వే వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం.. పేదరికంలో దేశంలో 18వ స్థానంలో నిలిచింది. ఏపీ.. దేశంలో 20వ పేద రాష్ట్రంగా నిలిచింది. అంటే.. ఏపీ కంటే రెండు స్థానాలు వెనుకబడే ఉంది తెలంగాణ. ఈ నివేదికను ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి నాలుగు రంగాల్లో.. వంటనూనెలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహవసతి, ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు లాంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని లెక్కగట్టారు. తాజా నివేదికలో.. పేదరికంలో బిహార్ రాష్ట్రం ఎప్పటిలానే మొదటి స్థానంలో నిలిస్తే.. రెండో రాష్ట్రంగా జార్ఖండ్, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. పేదరికం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ మరోసారి టాప్ ప్లేస్‌లో ఉంది. కేరళ తర్వాతి స్థానంలో గోవా.. సిక్కిం ఉన్నాయి. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లో.. ఆదిలాబాద్ జిల్లా అన్నిటికంటే పేద జిల్లాగా నిలిచింది. ఆదిలాబాద్‌లో ఏకంగా 27.43 శాతం ప్రజలు పేదరికంలో ఉండగా.. ఆ తర్వాత మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలు పూర్ డిస్ట్రిక్ట్స్‌గా నిలిచాయి. పేద జిల్లాగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గోదావరి నది ప్రవేశిస్తుంది. ఇక్కడ అనేక చిన్న నదులు.. వాగులు.. వంకలు ఉన్నాయి. చిన్న.. మధ్య తరహా ప్రాజెక్టుల్ని నిర్మించటానికి అవకాశాలు ఉన్నాయి. సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి. అయినా.. పాలకులు పట్టించుకోకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాను పేదరికం పట్టి పీడిస్తోంది. ఇక, కృష్ణానది ప్రవహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా సైతం పేదరికంలోనే ఉంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా పేదరికంలో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలవడం దారుణం. పేదరికం తక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్.. రంగారెడ్డి.. కరీంనగర్ జిల్లాలు టాప్ త్రీలో ఉన్నాయి. నీతిఆయోగ్ లేటెస్ట్ రిపోర్ట్.. సీఎం కేసీఆర్‌కు కచ్చితంగా షాకింగ్ న్యూసే. ఇన్నాళ్లూ ధనిక రాష్ట్రమంటూ గొప్పలు చెబుతూ.. ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడిక తెలంగాణ పేదరికంపై ఏం సమాధానం చెబుతారో చూడాలి...