YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి ముక్కలు

అమరావతి ముక్కలు

విజయవాడ, జనవరి 6,
రాజధాని అమరావతి ప్రాంతం ముక్కలవుతోంది. గతంలోనే రాజధాని సిటీ పరిధిలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు గ్రామాలను రాజధాని పరిధి నుండి మినహాయించారు. మంగళగిరి రూరల్‌ మండల పరిధిలోని కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం గ్రామాలను రాజధానిలోనే కొనసాగిస్తున్నారు. నూతనంగా అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎసిసిఎంసి) ఏర్పాటుకు గ్రామసభలు నిర్వహించి అనుమతులు తీసుకోవాలని నోటీసులు ఇచ్చారు. ఆరోతేదీ నుండి సభల నిర్వహణకు షెడ్యూలు కూడా ఇచ్చారు. తుళ్లూరు మండల పరిధిలో 16 గ్రామాలు, మంగళగిరి రూరల్‌ మండల పరిధిలోని మూడు గ్రామాల్లో సభలు నిర్వహించనున్నారు. దీనిపైనే రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజధాని ప్రకటన సమయంలో ఉండవల్లి నుండి బోరుపాలెం వరకూ రాజధానిగా చూపించి దానికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాను వేశారని, ఇప్పుడు కాదంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలంటే అన్ని గ్రామాలతోనూ కలిపి వేయాలని డిమాండు చేస్తున్నారు. వాస్తవంగా సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్‌ ఇచ్చిన మాస్టర్‌ప్లానులో 25 రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీలో కొంత భాగం కలిపి ఉంది. మాస్టర్‌ప్లాను అమలు చేయాలంటే ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది. లేకపోతే మాస్టర్‌ప్లానుకు విలువ లేదు. ప్రస్తుతం రాజధాని ఇక్కడే ఉంటుందని చెబుతున్న ప్రభుత్వం మాస్టర్‌ప్లానును దెబ్బతీస్తోంది. ఇదే అంశంపై రైతులు పలువురు కోర్టులోనూ గతంలో కేసులు వేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని గ్రామాలను మినహాయించడాన్ని తప్పుబట్టారు. ఒక నగరంగా నిర్దేశించిన ప్రాంతాన్ని ఎలా ముక్కలు చేస్తారని రైతులు కోర్టును ఆశ్రయించారు. కేంద్రం ఇచ్చిన రూ.1000 కోట్ల నిధులు కూడా మాస్టర్‌ప్లాను ఆధారంగానే ఇచ్చింది. అలాగే మొత్తం రాజధాని పరిధిలోని గ్రామాలను కలిపి అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయిం తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 19 గ్రామాలకే దాన్ని తగ్గించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అమరావతి ఆనవాళ్లు లేకుండా చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటట్లయితే మాస్టర్‌ప్లాను అమోదిస్తుందో లేదో చెప్పాలని కోరుతున్నారు. అమరావతి రాజధాని నగర మాస్టర్‌ప్లానుకు కేంద్రం కూడా అంగీకరించింది. అనంతరమే ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ప్లానును ముక్కలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం దీనిపై ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయడం లేదని నిలదీస్తున్నారు. అలాగే ఇటీవల కోర్టులో సిఆర్‌డిఎను పునరుద్ధరిస్తున్నామని అఫిడవిట్‌ దాఖలు చేసింది. అంటే సిఆర్‌డినే ఆమోదించాల్సి ఉంది. మాస్టర్‌ప్లాను రూపొందించింది సిఆర్‌డిఎ గనుక దాన్ని కూడా ఆమోదించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు 19 గ్రామాలతోనే క్యాపిటల్‌ సిటీ ఏర్పాటు చేస్తామనడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో 29 గ్రామాలతో కలిపిని రాజధానిగా ప్రకటించారని, ఇప్పుడు ముక్కలు చేయడంపై గ్రాసభల్లోనే అధికారులను నిలదీస్తామని చెబుతున్నారు. పూలింగు సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన హామీ మేరకు తాము భూములిచ్చామని, వాటిని అమలు చేయాలని కోరతామని రైతులు చెబుతున్నారు.

Related Posts