శ్రీకాకుళం, జనవరి 6,
ఎందుకో ఈ మధ్య ధర్మాన ప్రసాదరావు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. ధర్మాన ప్రసాదరావు కావాలనే ఈ కామెంట్స్ చేస్తున్నారా? లేక అన్యాపదేశంగా చేస్తున్నారా? అన్నది తెలియదు కాని గత రెండు రోజుల నుంచి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పార్టీకి ఇబ్బందికారంగా మారాయి. ధర్మాన ప్రసాదరావు ఆషామాషీ నేత కాదు. ఆయన అనుభవమున్న నేత. మంత్రిగా పనిచేశారు. ఆయనకు అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా తాను మంత్రిని కాలేకపోయానన్న దిగులు తప్పించి ఆయన పార్టీలో కంఫర్ట్ గానే ఉన్నారు. కానీ ఎందుకో అప్పుడప్పుడు మంత్రి పదవి విషయం మెదడును తొలుస్తున్నట్లుంది. అందుకే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు నిన్న చెత్త పన్నుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెత్త పన్ను వందరూపాయలు చెల్లించకపోతే వారి ఇంటిముందు పారేయమని పిలుపు నిచ్చారు. పన్ను చెల్లించని వారి ఇళ్ల ముందు చెత్తను పారేయమని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమయింది. విపక్షాలు ధర్మాన వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. చెత్త పన్ను మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై పార్టీ ఇరకాటంలో పడింది.