కరీంనగర్, జనవరం 6,
కాంగ్రెస్, బీజేపీ రెండూ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కత్తులు దూస్తున్నాయి.అయితే అదే సమయయంలో ఆ రెండు పార్టీల నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు అంతకంటే ఎక్కువగానే విమర్శల దిగుతున్నారు. ఒక విధంగా చూస్తే ప్రధాన శత్రువును పక్కన పెట్టి ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు.నిజానికి రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ శక్తివంతమైన పార్టీ. కానీ, జాతీయ స్థాయిలో, పరిస్థితి అది కాదు. క్రియాశీలంగా నిర్ణయాలు తీసుకునే సమర్ధ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు. కనుమరుగై పోయింది.ఇంచుమించుగా మూడేళ్ళుగా పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అఫ్కోర్స్, సోనియా గాంధీ ఆ పదవిలో ఉన్నా, వయసు, ఆరోగ్య దృష్ట్యా ఆమె పేరుకే ప్రెసిడెంట్ అన్నట్లుగానే వ్యవహారం నడుస్తోంది. రోజువారీ వ్యవహారాల్లో ఆమె చురుగ్గా పాల్గొనే పరిస్థితి లేదు. అలాగే, రాష్ట్రాల వ్యవహారాల్లో ఆమె పాత్ర నామమాత్రంగానే ఉందనేది కాదనలేని నిజం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను గట్టిగా విమర్శిస్తారు. ఆయన ట్విటర్’లో కనిపించినంతగా కార్య క్షేత్రంలో కనిపించరు. అలాగే, పార్టీ వ్యవహారాల ఫై ఆయన అంతగా దృష్టి పెట్టిన సందర్భాలు అంతగా లేవు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎదుర్కోవడంలో చూపే ఉత్సాహం, పార్టీ వ్యవహారాల్లో కనిపించదు. తెలంగాణ విషయాన్నే తీసుకుంటే, రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఇంచుమించుగా ఆరు నెలలు అవుతోంది. ఆరు నెలల్లో రేవత్ రెడ్డి పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. క్యాడర్’లో ఉత్సాహం నింపే విధంగా, తెరాస ప్రభుత్వంఫై పోరాటం చేస్తున్నారు. ఆ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాహుల గాంధీని ఆహ్వానించారు. ఒకటి రెండు సందర్భాలో రాహుల్ గాంధీ వస్తున్నారని కాంగ్రెస్ నాయకులకు ప్రకటించారు. అయినా, ఒక్క సారి కుడా రాహుల్ రాలేదు. రాష్ట్రంలో అంతగా బలంగా లేక పోయినా, బీజేపీ జాతీయ నాయకత్వం, బలంగా ఉండడమే కాకుండా రాష్ట్రం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అందుకే, ఏ అవకాశం చిక్కినా కేంద్ర నాయకులు రెక్కలు కట్టుకుని రాష్ట్రంలో వాలిపోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు, వివిధ సంధర్భాలలో బీజేపీ జాతీయ నాయకులు , కేంద్ర మంత్రులు అనేక మంది రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ అరెస్ట్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించిన తీరును గమనిస్తే, రాష్ట్రంఫై పట్టు పెంచుకునేందుకు కమల దళం అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదనే విషయం మరోమారు రుజువైంది. సహజంగా, రాష్ట్ర నాయకుల అరెస్ట్ వ్యవహారాన్ని ఏజాతీయ నాయకత్వం అంతగా పట్టించుకోదు. కానీ, బీజేపీ జాతీయ నాయకత్వం బండి సంజయ్ అరెస్ట్’ను పట్టించుకోవడం కాదు , ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..రంగంలోకి దిగారు. ఆ విధంగాగా బీజేపీ నాయకత్వం శ్రేణులకు కొత్త ఉత్సాహానిచ్చేందుకు బండి అరెస్ట్’ను ఉపయోగించుకుంది. అంతే కాకుండా తెరాసను ఎదుర్కోవడం ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యమనే సంకేతాలను జనంలోకి పంపేందుకు బండి అరెస్టును బీజేపీ ఉపయోగించుకుంది. ఒక విధంగా చూస్తే, ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆ ఎన్నికల పర్యవసానంగా చోటు చేసుకున్న వరి వివాదం విషయంలో, తెరాసపై పై చేయి సాధించిన బీజేపీ, ఇప్పుడు మరోసారి కేసీఆర్ ఎత్తును చిత్తు చేసింది.ఆ విధంగా పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహానిస్తోంది. నిజానికి బండి సంజవై అరెస్టు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఇంతలా స్పందిస్తుందని కేసీఆర్ ఉహించి ఉండక పోవచ్చును. అందుకే, నడ్డాకు అడ్డుచేప్పే ప్రయత్నం అంతగా చేయలేదు. ఆయన్ని విమానాశ్రయంలోనే అరెస్ట్ చేస్తారని తెరాస నాయకులు, అధికార వర్గాలు ముందునుంచి లీకులు యిచ్చినా చివరకు నడ్డా నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ఇది తెరాస, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమే అనుకున్నా, ఈ ఎపిసోడ్’తో బీజేపీకి కొంత పొలిటికల్ మైలేజి పెరిగింది అనేది మాత్రం కాదనలేని నిజం. అలాగే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం చొరవ చూపి రాష్ట్ర పార్టీలోని అంతర్గత విబేధాలను పరిష్కరించడంతో పాటుగా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తమవంతు సహకారం అందించడం అవసరమని పార్టీ వర్గాలలోనే వినవస్తోంది.