YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సంతనూతల పాడు వైసీపీలో లొల్లి

సంతనూతల పాడు వైసీపీలో లొల్లి

ఒంగోలు, జనవరి 7,
టీజేఆర్ సుధాకర్‌బాబు. ప్రకాశంజిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు అభ్యర్థిగా వైసీపీ నిర్ణయించటంతో ఇక్కడకు వచ్చి.. పోటీ చేసి వైసీపీ గాలిలో సునాయసంగా గెలిచారు. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పొరుగు వ్యక్తిగా చూడకుండా అక్కున చేర్చుకున్నారు కూడా. కొత్తలో ఎమ్మెల్యేకు.. కేడర్‌కు మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా.. రెండున్నరేళ్ల తర్వాత లుకలుకలు బయటకు వస్తున్నాయి. అవి కొత్త రగడకు.. చర్చకు దారితీస్తున్నాయట.ఆ మధ్య సొంత పనులపై హైదరాబాద్‌ వెళ్లిన ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అవసరం లేదంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారట. ఈ అంశం అధికారపార్టీతోపాటు పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. నాగులుప్పలపాడు మండలంలో ఆ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనస్తాపం చెంది ఎమ్మెల్యే ఆ నిర్ణయం తీసుకున్నారని లోకల్‌గా వినిపిస్తున్న టాక్‌. ఆ మండలంలోని ఒక కీలక నేతకు.. ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు మధ్య సమన్వయం కొరవడిందట. ఎంపీడీవో నియామకంపై బేధాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది.నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఆ నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. చీమకుర్తి నుంచి మరో కీలకవర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధిష్ఠానాన్ని కలిసి ఫిర్యాదు చేసిందట. ఈ పరిణామాలపై అసంతృప్తి చెందిన సుధాకర్‌బాబు తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారని చెబుతున్నారు.నియోజకవర్గంలోని గ్రామ, మండలస్థాయి అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధం లేకుండా తనకు ఇష్టం వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత సహాయ సిబ్బందిలో ఐదుగురిని చీమకుర్తి నగర పంచాయతీ ఉద్యోగులుగా చూపించి జీతాలు తీసుకోవటం కూడా విమర్శలకు దారి తీస్తోందట. పంచాయతీ విధులకు హాజరుకాకుండా వారెలా జీతాలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారట. వారికి జీతాల కోసమే ఏటా ఏడు లక్షలు ఖర్చవుతున్నట్టు సమాచారం.గతంలో కూడా అధికారుల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేస్తుంటారు ఆయన ప్రత్యర్థులు. పనిలోపనిగా ఎమ్మెల్యే కూడా సొంత వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. తనకు అనుకూలంగా ఉన్న నేతలకు పనులు చేసుకునేందుకు అవకాశాలు ఇస్తున్నట్టు వైరివర్గం మండిపడుతోంది. అలాగే వైసీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్న ద్వితీయ శ్రేణి నేతల కార్యకలాపాలపై సేకరించిన సమాచారాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యే పంపారట. దీంతో సంతనూతలపాడు వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీలోని ఆయన ప్రత్యర్థివర్గంగా పరిస్థితి మారిందట.పరిస్థితి చేజారిపోకుండా సమస్యలను పరిష్కరించే బాధ్యతను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్ఠానం అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. సంతనూతలపాడు వైసీపీలో అసమ్మతిని చల్లార్చేందుకు మంత్రి బాలినేని ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారు? పార్టీ కేడర్‌ ఎమ్మెల్యే వెంట నడుస్తుందా.. ఢీ అంటే ఢీ అని ఘర్షణ పడుతుందో చూడాలి.

Related Posts