శ్రీకాకుళం, జనవరి 7,
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావించారు. కానీ ఇప్పుడు చూస్తే అసలుకే ఎసరు వచ్చింది. ఆయనే పాయకరావుపేట ఎమ్మెల్యే గొర్ల బాబూరావు. మూడు సార్లు గొర్ల బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. దళిత కోటా కింద ఆయనకు మంత్రి పదవి తొలివిడతలోనే రావాల్సి ఉంది. అయితే అదే జిల్లాలో అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయనకు దక్కలేదు. ఇక రెండోవిడత విస్తరణలో తనకు ఖచ్చితంగా జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ ఆయన ఆశలు నెరవేరేటట్లు లేవు. దానికి కారణం ఆయన చేతులారా చేసుకున్నదే. క్షేత్రస్థాయిలో గొర్ల బాబూరావు కు పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుంది. పాయకరావు పేట నియోజవర్గంలో అన్ని మండలాల్లో సొంత పార్టీ నేతలే ఎదురుతిరుగుతున్నారు. తాము వైసీపీలోనే ఉంటామని, కానీ బాబూరావుకు వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం తొలి నుంచి కాపులకు సానుకూలంగా ఉండే నియోజకవర్గం. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. కానీ ఇది రిజర్వడ్ నియోజకవర్గం అయింది. దీంతో ఇక్కడ ఎస్సీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచినా కాపు నేతలు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. గొర్ల బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీలో గ్రూపులు ఆయనకు చికాకు పెట్టే విధంగా ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో తిరగాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పాయకరావుపేటలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధిష్టానం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. అంటే గొర్ల బాబూరావుపై హైకమాండ్ పాజిటివ్ థింకింగ్ లేనట్లే ఉంది. ఆయన కొన్నాళ్లు అధిష్టానం పై అలిగి నియోజకవర్గానికి దూరంగా కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ సభ్యుడిగా నియమించారు. అదీ ఆయనకు ఇష్టంలేదు. మొత్తం మీద పాయకరావుపేటలో నెలకొన్న పరిస్థితుల్లో ఆయనకు వచ్చే మంత్రివర్గంలో కూడా చోటు దక్కే అవకాశాలు లేవన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం