YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆందోళనలో ఖమ్మం మిర్చి రైతులు

ఆందోళనలో ఖమ్మం మిర్చి రైతులు

ఖమ్మం, జనవరి 7,
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. పంటలు పండకపోవటంతో భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. గత యేడాది మిర్చి సాగు చేసిన రైతుల పంట పండింది. ఎగుమతులు సైతం పెరిగాయి. విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి.ప్రస్తుతం మార్కెట్‌లో 18 వేల పైచిలుకు ధర పలుకుతోంది. గతంలో ఏసీ మిర్చికి మాత్రమే ఈ ధర ఉండేది. భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో గత యేడాది 55 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ యేడాది లక్షా 20 వేల ఎకరాల్లో మిర్చి వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత యేడాది కేవలం పది వేల ఎకరాల్లోనే మిర్చి సాగు చేయగా ఈ యేడాది మాత్రం 30 వేల ఎకరాల్లో పంట వేశారు.ఈ యేడాది మంచి ధర ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మిర్చికి చీడపీడలు వ్యాపించాయి. పురుగు మందులు కొట్టినా వదలడం లేదు. దిగుబడి పూర్తిగా పడిపోయింది. మొత్తం పంటలు సర్వ నాశనం అయ్యాయి. రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. వ్యవసాయ అధికారులు పంటల పరిశీలనకు వచ్చి చేతులెత్తాశారు. పంట మార్పిడి చేయాలని వ్యవసాయ అధికారులు ఉచిత సలహా ఇచ్చేసి వదిలేస్తున్నారు. తాము పంట మార్పిడి చేసినా ఈ ఏడాది పురుగు దాడి చేసిందని చెబుతున్నారు రైతులు. గత యేడాది పత్తి సాగు చేయగా…ఈ యేడాది మిర్చి సాగు చేశామని చెబుతుంటే అధికారులు మాత్రం తెల్లమొహం వేస్తున్నారు.దిగుబడి రాకపోవటంతో చేసేదేమి లేక పంటంతా పీకేస్తున్నారు. జెసిబిలతో తొక్కించి మళ్లీ ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అయిదుగురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇక…ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా పోయింది. ఖమ్మం, మధిర, ఇల్లెందు ఏరియాల్లో పంట బారీగా నష్టపోయింది. ఇక్కడ పండే మిర్చి ఖమ్మం, గుంటూరు, జగదల్‌పూర్‌, నాగ్‌పూర్‌ మార్కెట్లకు ఎగుమతి అవుతుంది. ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. తామర పురుగు దాడితో ఎకరానికి క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా సగానికి సగం దిగుబడులు పడిపోయాయి. మరోవైపు…మిర్చి సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఉద్యమాలు సాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు అధికారులకు వినతి పత్రాలను అందించారు.సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంటలకు ఇంత నష్టం వస్తుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగానికిపైగా తోటలు దెబ్బతిని.. దున్నుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పొలాలవైపు వెళ్లడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాలు పర్యటించి వెళ్లారు. సమగ్ర సస్య రక్షణ చర్యలు సూచించినా ఏమాత్రం ఫలితం రావడం లేదు. నకిలీ విత్తనాల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. తెగుళ్ల ను పరిశీలించాల్సిన వ్యవసాయ శాఖ కనిపించకుండా పోయింది. రైతులకు సలహాలు ఇచ్చే వారే లేకుండా పోయారు. ఫలితంగా మిర్చి సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

Related Posts