హైదరాబాద్, జనవరి 7,
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం సమయంలో పరిమితి మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకునే ఖర్చును సవరణలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు.. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలకు ఎంత మేర ఖర్చు చేయొచ్చనే అంశంపై సవరణ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజవర్గానికి రూ. 95 లక్షలు, అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ. 40 లక్షల వరకు ఖర్చు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణల్లో పార్లమెంట్ నియోజవర్గానికి రూ. 77 లక్షలు, అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ. 30.80 లక్షల వరకు ఖర్చు చేసుకునేందుకు అనుమతి ఉండేది. సవరణ నోటిఫికేషన్‌తో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అధికారికంగా మరింత ఖర్చు పెట్టుకున్నట్టు లెక్కలు చూపుకునే వెసులుబాటు కలుగనుంది.