హైదరాబాద్, జనవరి 7,
వైసీపీకి దూరంగా ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజురాజీనామాకు రెడీ అవుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానని ఆయన సవాల్ విసిరారు. కొంత కాలంగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. తరచూ వైసీపీ అధిష్టానం తీరుపై విరుచుకపడుతున్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తనపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రఘురామపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ యాక్షన్ తీసుకుంటారని తెలిసి… రఘరామకృష్ణమరాజు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు స్వయంగా ఆయన మీడియాకు వెల్లడించారు.తనపై అనర్హత వేటు వేయించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అనర్హత వేటు వేయించేందుకు సమయం ఇస్తున్నట్లు తెలిపిన రఘురామ.. వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. ఏపీలో అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే.. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రఘురామ భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగానే ఆయన నరసాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది.