గుంటూరు, జనవరి 10,
సంక్రాంతి పండగ పేరు చెప్పి ప్రయాణికులను నిలవునా దోచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే టికెట్ ధరలను ఇష్టారాజ్యం పెంచేశాయి. అడ్డగోలుగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇదేమని అడిగే నాథులు కనపడడం లేదు. అధికారయంత్రాంగం కూడా చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అయితే గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ బస్సుకు రూ.400, ఏసీ బస్సుకు రూ. 500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.700, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్‌ఏసీ రూ.400, ఏసీ రూ.500, స్లీపర్ ఏసీ రూ.800 డిమాండ్‌ను బట్టి కొంచెం అటుఇటుగా చార్జీలు ఉంటాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి పేరు చెప్పి ఈ టికెట్ల వెలను ఆయా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాంతం పెంచేశాయి.ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.400 నుంచి రూ.1,000 వరకూ దోచుకుంటున్నాయి. ఆయా ట్రావెల్స్ తమ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి వీరంతా స్వగ్రామాలకు రావడం సహజం. దీంతో సంక్రాంతి సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనమయ్యే అవకాశాలు ఉండటంతో ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి గుంటూరుకు
ధరలు ఇలా (రూపాయల్లో)..
బస్సు రకం సాధారణ ధర పండగ ముందు చార్జి
నాన్‌ఏసీ 300–500 1,000
నాన్ ఏసీ స్లీపర్ 600–700 1.000
ఏసీ 540 1,200
స్లీపర్ ఏసీ 700–800 1,400/1,500
గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ధరలు ఇలా(రూపాయల్లో).. .
బస్సు రకం సాధారణ ధర పండగ ముందు చార్జి
నాన్‌ఏసీ 400 900–1,500
నాన్ ఏసీ స్లీపర్ 600 1000–1,500
ఏసీ 500–700 1,150–1,500
స్లీపర్ ఏసీ 800–900 1,300/2,500