విజయనగరం, జనవరి 10,
విజయనగరం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిచేసిన రాక్ గార్డెన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పార్కు ఉండగా.. ఆంధ్రాలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. అమృత్ పథకం నిధులతో ఈ పార్కును నిర్మించారు. నగరంలోని ఐదున్నర ఎకరాల సువిశాల స్థలంలో అభివృద్ధి చేసిన రాక్‌గార్డెన్ అరుదైన ఔషధ మొక్కలతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు సిద్ధమైంది. గార్డెన్ ఆవరణలో దేశ, విదేశాలకు చెందిన 118 రకాల జాతుల మొక్కలను నాటారు. వీటన్నింటినీ హైదరాబాద్ నుంచి తెప్పించారు. రాక్ గార్డెన్ విద్యార్థులకు ఉపయుక్తం. గార్డెన్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు బొటానికల్ మొక్కలు ఉన్నాయి. సైన్స్ విద్యార్థులు ప్రత్యక్షంగా మొక్కలను పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది. వాటి శాస్త్రీయ నామాలను పార్క్ నిర్వహణ సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలి బొటానికల్ గార్డెన్ విజయనగరంలో రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలు సందర్శించి విజ్ఞానం పెంచుకోవాలి.