ఏలూరు, జనవరి 11,
ఎంపీ రఘురామ కృష్ణరాజు. త్వరలోనే ఆయన మాజీ కానున్నారు. ఆ తర్వాత మళ్లీ ఎంపీ అవుతారా లేదా అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయన గెలిచినా సంచలనమే.. ఓడినా సంచలనమే. అందుకే రఘురామ కేంద్రంగా ఏపీ, వైసీపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. వైసీపీకి, జగన్‌కు ఫిబ్రవరి 5 వరకూ టైమ్ ఇచ్చారు రఘురామ. ఆలోగా తనపై అనర్హత వేటు వేయించాలని సవాల్ చేశారు. లేదంటే, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మరోసారి తేల్చి చెప్పేశారు. తగ్గేదేలే. రఘురామ అసలేమాత్రం తగ్గేదే లే అంటున్నారు. సంక్రాంతికి నర్సాపురం వస్తున్నా.. రెండు రోజులు అక్కడే ఉంటున్నా.. అంటూ జగన్ ప్రభుత్వాన్ని కవ్వించారు ఆ పార్టీ ఎంపీ. గతంలో ఆయన్ను ఏపీ సీఐడీ కస్టడీ ఎపిసోడ్ తర్వాత చాన్నాళ్ల పాటు ఢిల్లీకే పరిమితం అయ్యారు. ఇటీవలే తిరుపతిలో అమరావతి రైతుల సభ సందర్భంగా మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నెల 13న తన సొంత ప్రాంతం నర్సాపురం వెళ్తున్నారు. సంక్రాంతి అక్కడే జరుపుకోనున్నారు. ఈ విషయం ఆయనే చెప్పారు. పరోక్షంగా, దమ్ముంటే ఇప్పుడు టచ్ చేసి చూడండంటూ జగన్ సర్కారుకు రఘురామ ఈ విధంగా సంక్రాంతి సవాల్ చేశారంటున్నారు. రఘురామ నర్సాపురం వెళ్తుండటంతో.. ఆయన పక్కా రాజీనామా చేయబోతున్నారని తేలిపోతోంది. ఆయనవి ఉత్తుత్తి బెదిరింపులు కావని.. జగన్‌కు ఎన్నికల పరీక్ష పెట్టేందుకు, అమరావతి ప్రజాకాంక్షను బలంగా చాటేందుకు సిద్ధమై పోయారని తెలుస్తోంది. కుదిరితే మీరే అనర్హత వేటు వేసుకోండి.. లేదంటే నేనే రాజీనామా చేసి పారేస్తా.. అంటున్న రఘురామ ధైర్యాన్ని ఒప్పుకోవాల్సిందే..అంటున్నారు. ఇంతకీ రఘురామకు ఎందుకంత ధీమా? అంటే అమరావతే తనకు శ్రీరామరక్ష అని భావిస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారని చెప్పేందుకే.. తాను ఓడిపోయినా పర్వాలేదు.. అమరావతి ఆకాంక్షను బలంగా చాటాలని.. అమరావతినే ఎజెండాగా ఉప ఎన్నికలకు వెళ్లాలని రఘురామ ఫిక్స్ అయ్యారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెబుతున్నారు. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.గెలుపుపై రఘురామ అంత కాన్ఫిడెంట్‌గా ఉండటం మామూలు విషయమేమీ కాదు. ఇటీవల వరుస ఎన్నికల్లో వైసీపీ భారీగా గెలిచినా.. అది బలుపు కాదు వాపు అని.. అక్రమాలు, తాయిలాలు, బెదిరింపులతో గెలిచారని అందరికీ తెలుసంటున్నారు. ప్రజల్లో జగన్‌పై, వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని రఘురామ గట్టిగా నమ్ముతున్నారు. ఓటీఎస్, పీఆర్సీ, అమ్మ ఒడి, ఈబీసీ నేస్తం వాయిదా, ఇసుక ధరలు, నిరుద్యోగం.. ఇలా అనేక అంశాల్లో ప్రజలు వైసీపీపై రగిలిపోతున్నారు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశం తానే కావాలని.. నర్సాపురం ఉప ఎన్నికతో జగన్‌కు బుద్ధి చెప్పాలనేది రఘురామ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే, తాను ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి.. పార్టీలకు అతీతంగా అంతా తనకు మద్దతు ఇచ్చేలా చూసుకొని.. అమరావతిపై ప్రజాభిప్రాయం కోసమే నర్సాపురం ఉపఎన్నిక అనేలా ప్రజలను కూడగట్టి.. జగన్‌కు దిమ్మతిరిగేలా దెబ్బకొట్టేందుకే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని అంటున్నారు. మరి, రఘురామ సంధించే అమరావతి రామబాణం.. జగన్‌ని, వైసీపీని ఎంతగా డ్యామేజ్ చేయనుందో చూడాలి.