విజయవాడ, జనవరి 11,
అసలే పండుగ సీజన్.. ఆపై కరోనా.. సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోతే వైరస్ బారిన పడాల్సిందే. ఈ క్రమంలోనే అధికారులు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని.. ఒకవేళ లేకుంటే రూ. 50 జరిమానా విదిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. దీనిపై తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణించేవారికి ఫైన్‌లు విధించలేదని.. కేవలం బస్ స్టేషనలలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి మాత్రమే జరిమానా విధించామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. బస్ స్టేషన్లలో బస్సులకు అడ్డంగా బైకులు పెట్టడం, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపినందుకు, బహిరంగ మూత్ర విసర్జన, బస్ స్టాండ్లలో మాస్కులు లేకుండా తిరగడం లాంటివి నియంత్రించడంలో భాగంగా అధికారులు ఫైన్స్ వేస్తున్నారని.. బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ఫైన్లు విధించడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు.
పెరుగుతున్న కరోనా కేసులు
మళ్ళీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. కరోనా పై పోరాటం చేయడంలో ముందున్న ప్రంట్ లైన్ వారియర్స్ ముఖ్యంగా వైద్య సిబ్బంది భారీగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజ్‌లో నలుగురు హౌస్ సర్జన్‌లతో పాటుగా పలువురు విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..కర్నూలు జిల్లాలోని మెడికల్ కాలేజ్‌లో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కాలేజీలో మొత్తం 15మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. నలుగురు హౌస్ సర్జన్‌లకు, 11మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ 11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కరోనా బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్సనందిస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,78,964కి చేరినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. భారీగా కొత్త కేసులు నమోదవుతూ భయాందోళన కలిగిస్తోంది.