విశాఖపట్టణం, జనవరి 11,
సుద్ద గని ఆ గ్రామానికి నిధి…తాతల నాటి నుండి కొన్ని కుటుంబాలకు జీవనోపాధి అదే. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో ముగ్గుకి ప్రాధాన్యత ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో తెలతెలవారకముందే కళ్ళాపి జల్లి ముగ్గు వేయడం సనాతన ఆచారం. ముగ్గు పిండి తయారీకి పెట్టింది పేరైన బెన్నవోలులో ఇప్పుడేం జరుగుతోంది?విశాఖ జిల్లా చోడవరం మండలంలో మేలు రకం ముగ్గు పిండికి పెట్టింది పేరు బెన్నవోలు గ్రామం. గ్రామ సమీపంలో సుద్దగని కొండ ఉంది. ఈ గ్రామానికి చెందిన పల్లీలు జాతికి చెందిన కొన్ని కుటుంబాలు, సుద్దపిండి అమ్ముకునే జీవనం సాగిస్తుంటాయి. శ్రమే వీరి వృత్తికి పెట్టుబడి. బెన్నవోలు గ్రామానికి అనుకొని ఉన్న కొండను సుద్దగని అని పిలుస్తారు. తెల్లవారుజామున సుమారు రెండు కిలోమీటర్ల కొండ ఎక్కి అక్కడున్న సుద్దరాయిని సేకరిస్తారు. గునపంతో తవ్వి ముడిసరకును బస్తాలలోకి నింపి, సైకిల్ మీద గ్రామానికి తరలిస్తారు. పెద్ద పెద్దగా ఉన్న సుద్దరాయిని చితక్కొట్టి, తారు రోడ్డు మీద ఆరబోస్తారు.రోడ్డుపై వెళ్లే వాహనాల ద్వారా బాగా తొక్కించి, ఎండబెట్టిన దానిని జల్లించిన ముగ్గు పిండిని బస్తాలకు నింపుతారు. ఈ పిండినే ఊరూరా తిరిగి అమ్ముకొని జీవనోపాధి సాగిస్తుంటారు. తమ ఇంటి దగ్గర బస్తా ముగ్గు పిండిని అమ్మితే 150 రూపాయలు, గ్రామాలకు పోయి అమ్మితే 500 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందంటున్నారు అమ్మకందారులు. కొన్ని ఊళ్లల్లో అయితే వస్తు మార్పిడికి ముగ్గు పిండి ఇస్తారు. డబ్బులకే కాకుండా బియ్యానికి సరిపడా ముగ్గుపిండిని ఇస్తారు అమ్మకం దారులు. పండగలు, పబ్బాలకు అయితే, ఇక్కడి ముగ్గు పిండికి మంచి గిరాకీ ఉంటుంది.