విజయవాడ, జనవరి 11,
రామ్‌గోపాల్‌వర్మ. పక్కా వైసీపీ మనిషి. జగన్‌కు బాహాటంగానే సపోర్ట్ చేస్తారు. చంద్రబాబును బహిరంగంగానే కించపరుస్తారు. లేటెస్ట్‌గా ఏపీలో సినిమా టికెట్ల వివాదంలోనూ వర్మ తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. జగన్ అంటే ఇప్పటికీ అభిమానం అంటూనే.. మంత్రి పేర్ని నానితో డైలాగ్ వార్‌కు దిగారు. వారిద్దరి ఎపిసోడ్‌లో మిగతా గొంతుకలన్నీ మూగబోయాయి. ఆర్జీవీనే టాలీవుడ్ ప్రతినిధిగా మార్చేశాయి. కానీ, ఆయన మాత్రం తాను సింగిల్.. తన వెనుక ఎవరూ లేరని చెబుతున్నారు. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టులో వర్మకు ఇచ్చిన వెల్‌కమ్ మామూలుగా లేదు. పదిమందికి పైగా పోలీసుల రక్షణ మధ్య ఆర్జీవీని పేర్ని నాని దగ్గరికి తీసుకెళ్లారు. ఇంతకీ, వర్మకు అంతగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకెవరైనా వార్నింగ్ ఇచ్చారా? లేక, ఈయన ఎవరినైనా బెదిరించారా? లేదే. మరి, ప్రభుత్వం వర్మ విషయంలో అంత ఓవర్ రియాక్షన్ ఎందుకనేది ఓ ప్రశ్న. వర్మ ఇండస్ట్రీ ప్రతినిధి కాదు. పరిశ్రమ తరఫున మాట్లాడటం లేదు. అవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలేనని చెబుతున్నారు. అలాంటిది, ఆర్జీవీతో మంత్రి పేర్ని నాని చర్చలు జరిపితే ప్రయోజనం ఏముంటుంది? తమ పార్టీ సానుభూతిపరుడే కాబట్టి వర్మను ముందుంచి.. ఆయనతో మాట్లాడించి.. చేతులు కాలాక ఈ ఎపిసోడ్‌పై ఆకులు పట్టుకోవాలనేది ప్రభుత్వ ప్లాన్‌గా కనిపిస్తోందంటున్నారు. సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా పరువు పోగొట్టుకుంది. 5 రూపాయలకే సినిమా టికెట్‌తో దారుణ రూల్స్ తీసుకొచ్చింది. ఏపీలో 240 థియేటర్లు మూతపడ్డాయి. పరిశ్రమ వర్గాలన్నీ జగన్‌ను విలన్‌గా చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే పరువంతా పోతుంది. కానీ, వెనక్కి తగ్గక తప్పని దుస్థితి. అందుకే, ఏ చిరంజీవినో, దిల్ రాజునో, రాఘవేంద్రరావునో అడిగితే తగ్గించకుండా.. తమ వాడైన, తమ మనిషైన ఆర్జీవీని రంగంలోకి దింపారంటున్నారు. పక్కా స్క్రిప్ట్ ప్రకారమే వర్మ యాక్షన్ చేస్తుంటే.. పేర్ని నాని రియాక్షన్ ఇస్తున్నారని అనుమానిస్తున్నారు. వర్మకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న రాచమర్యాదలు చూస్తుంటే ఆ విషయం మరింత కన్ఫామ్ అవుతోంది. ఆర్జీవీకి ఎయిర్‌పోర్టులో పోలీస్ సెక్యూరిటీ మధ్య వెల్‌కమ్ చెప్పడం.. పేర్ని నానితో మీటింగ్‌లో స్పెషల్ గెస్ట్‌కు పార్టీ ఇచ్చినట్టు రొయ్యల కూర, మటన్, చికెన్, ప్లెయిన్ బిర్యానీతో విందు భోజనం ఏర్పాటు చేయడం (వోడ్కా ఇచ్చారో లేదో తెలీదు) చూస్తుంటే.. దొందు దొందేనా అనే డౌట్ రాకమానదు. వర్మ ప్రభుత్వాన్ని ఒప్పించినట్టు చేయడం.. ఆ తర్వాత ఆర్జీవీ సూచనలకు సర్కారు ఓకే అనడం.. అలా టికెట్ ధరల తగ్గింపుతో కలిగిన డ్యామేజీకి.. రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో శుభం పలికేలా స్క్రీన్‌ప్లే రచించారని అంటున్నారు.