విజయవాడ, జనవరి 11,
కొత్త పీఆర్సీ వచ్చింది. కొత్త ఏడాదిలో అంతా శుభారంభం అనుకున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, వారి భ్రమలు అంతోనే తొలగిపోయాయి. సీఎం కుర్చీలో ఉన్నది జగనన్న కావడంతో.. ఉద్యోగులకు ఝలక్ తప్పడం లేదు. పీఆర్సీతో లెక్కల గారడీ చేసి.. ఉన్న జీతాన్ని తగ్గించి.. డీఏలతో మభ్య పెట్టారు ముఖ్యమంత్రి. పీఆర్సీ వాత-కోత నుంచి ఇంకా కోలుకోకముందే.. అప్పుడే పదో తేదీ వచ్చేసినా.. ఇప్పటికీ చాలామంది ఉద్యోగులకు జీతాలు రాలేదు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు పింఛన్లు పడలేదని.. గగ్గోలు మొదలైంది. దాదాపు 30 శాతానికిపైగా ఉద్యోగులకు, సగం మంది పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లకు 5,500 కోట్లు అవసరం. ఇందులో పెన్షన్ల రూపంలో రూ.1,500 కోట్లు, మిగిలినవి జీతాలు. ఈ నెల పెన్షన్లు ఇంకా 750 కోట్ల వరకు చెల్లించాలి. కానీ, ఖజానా ఖాళీగా ఉండటంతో కొత్త అప్పులకు కేంద్ర అనుమతి కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఢిల్లీ బాటపట్టారు. సోమవారం ఎలాగైనా కేంద్ర ఆర్థికశాఖ అధికారులను ఒప్పించి అప్పులకు అనుమతి తీసుకుని.. మంగళవారం ఆర్‌బీఐ దగ్గర రాష్ట్రాల సెక్యూరిటీ వేలంలో పాల్గొన్ని అప్పులు తేవాలనేది వారి ఢిల్లీ పర్యటన లక్ష్యం. కేంద్రం కొత్త అప్పులకు అనుమతివ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పు రాకపోతే ఈ నెల వేతనాలు, పెన్షన్లు అందవేమోనని హైరానా పడుతున్నారు. ఈఎమ్ఐలు కట్టాల్సిన ఉద్యోగుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే డబ్బుల్లేక ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసుకుంది. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోగా.. అప్పు కూడా పుట్టకపోవడంతో.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జనవరి 10న అమలు చేస్తానంటూ ప్రకటించిన ఈబీసీ నేస్తం పథకాన్ని వాయిదా వేసుకుని పరువు తీసుకుంది. డిసెంబరు 28న రూ.2,250కోట్లు, జనవరి 4న రూ.2,500కోట్లు ప్రభుత్వం అప్పుతెచ్చింది. 6న కేంద్రం నుంచి రెవెన్యూ లోటు నిధులు రూ.1,438కోట్లు వచ్చాయి. పన్నుల రూపంలో, వివిధ రూపాల్లో ఖజానాకు రెగ్యులర్‌గా వచ్చే ఆదాయం.. అన్నీ కలిపితే గత రెండు వారాల్లో రూ.6,500 కోట్లకు పైగా వచ్చాయి. వేతనాలు, పెన్షన్ల పూర్తిస్థాయి చెల్లింపులకు అవసరమైన వాటికంటే ఇది ఎక్కువే. అయినా, జీతాలు, పెన్షన్లు పెండింగ్‌లో పెట్టారంటే.. ఆ సొమ్మంతా ఎటుపోయింది? ఏం చేశారు? కాకి ఎత్తుకు పోయిందా? అని ప్రశ్నిస్తున్నారు.