హైదరాబాద్, జనవరి 11,
తెలంగాణకు దేశ నలుమూలల నుంచి కమలం పెద్దలు క్యూ కడుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ తర్వాత కాషాయ దండయాత్ర జోరుగా సాగుతోంది. ఢిల్లీ నుంచి జేపీ నడ్డా మొదలు.. పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ సీఎం నుంచి.. ఎక్కడో ఉన్న అసోం ముఖ్యమంత్రి వరకూ.. కమలనాథులు తెలంగాణలో జొరబడి కేసీఆర్‌కు వార్నింగులు ఇచ్చేసి పోతున్నారు. వాళ్లు ఒకటంటే.. ఇక్కడి గులాబీ నేతలు రెండంటున్నారు. కేటీఆర్, హరీశ్, కవితల నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయం ధూంధాంగా నడుస్తోంది. గతేడాది బెంగాల్‌లోనూ ఇలాంటి రాజకీయమే నడిచింది. బీజేపీ వాళ్లు సేమ్ ఇలానే అటాకింగ్ స్ట్రాటజీ అమలు చేశారు. కేసీఆర్‌లానే దీదీ సైతం బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. మోదీ వర్సెస్ మమత.. హోరాహోరీగా సాగిందా బెంగాల్ దంగల్. కాషాయ పరివారమంతా కోల్‌కతాలో వాలిపోయింది. వీళ్లు తిట్టుడు.. వాళ్లు కొట్టుడు. విధ్వంసాలు, హత్యలూ జరిగాయి. బెంగాల్‌లో రచ్చ రంభోలా. కేంద్ర బలగాలు సైతం మోహరించాల్సి వచ్చింది. అగ్నిగుండంగా మారిన ఆ బెంగాల్ దంగల్‌లో చివరాఖరికి దీదీదే పైచేయి. ఓడినా.. మమతను ఓడించి గెలిచినంత పనిచేసింది బీజేపీ.బెంగాల్‌లో కమలదళానికి బాగా కలిసొచ్చిన ఆ దూకుడు పాలిటిక్స్‌ను తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేస్తోంది బీజేపీ. బండి సంజయ్ దీక్ష భగ్నం చేసి.. అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇక అంతే. కమలనాథులు కస్సున లేచారు. ఓ కేసుకు ఇవ్వాల్సిన రియాక్షన్ కంటే చాలా ఎక్కువే ఇస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చారంటే ఓ అర్థం ఉంది. మధ్యప్రదేశ్ సీఎం, అసోం సీఎం ఎందుకు వచ్చారో.. వారొచ్చి హిందీలో కేసీఆర్‌ను తిట్టి పోస్తే.. తెలంగాణలో పార్టీకి ఏం లాభమో వారికే తెలియాలంటున్నారు.
భవిష్యత్‌లో బీజేపీ చేయబోయే మూకుమ్మడి దండయాత్రకు రిహార్సల్స్ అని.. బెంగాల్‌లో అమలు చేసిన పొలిటికల్ స్ట్రాటజీనే.. ఇకపై తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయనున్నట్టు సిగ్నల్స్ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో బెంగాల్‌ను పొలిటికల్ వార్‌జోన్‌గా మార్చి మాగ్జిమమ్ లాభపడిన బీజేపీ.. ఇక తెలంగాణపైనా మూకుమ్మడి దాడి చేసి.. కేసీఆర్‌ను కుమ్మేసి.. తెలంగాణ రాజకీయాలను దున్నేయాలనేది కమలనాథుల అటాకింగ్ గేమ్ అంటున్నారు. అప్పట్లో దాడులు, బాంబులతో బెంగాల్ దద్దరిల్లింది.. మరి, తెలంగాణలో ఎలాంటి ధూంధాం చూడాల్సి వస్తుందో...అంటున్నారు.