న్యూఢిల్లీ. జనవరి 11,
దేశ వ్యాప్తంగా కరోనా జూలు విదుల్చుతోంది. కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ సెకండ్ వేవ్ నాటి దీన పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. నిన్న( జనవరి 10) ఢిల్లీలో దాదాపు 19, 166 కొత్త కేసులు వెలుగు చూడడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. అదేవిధంగా సోమవారం కరోనాతో ఏకంగా 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాన్ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. కరోనా కట్టడికి సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈమేరకు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు మూసి వేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. కేవలం డెలివరీ, పార్శిల్ సౌకర్యాలను మాత్రమే నిర్వహించుకోవాలని ఉత్తర్వలు జారీ చేసింది. అదేవిధంగా అత్యవసర సేవలు మినహా అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ఉద్యోగులు, సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని సూచించింది. కాగా రాజధానిలో ప్రస్తుతం 65,803 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా 44,028 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. పెరుగుతున్న కొత్త కేసుల కారణంగా రాష్ట్రంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 25 శాతానికి ఎగబాకింది.