YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తెరపైకి టెక్ ఫాగ్ యాప్

తెరపైకి టెక్ ఫాగ్ యాప్

న్యూఢిల్లీ, జనవరి 11,
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన రాజకీయాలలో మరోసారి గూఢచర్యం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. టెక్‌ ఫాగ్‌ అనే యాప్‌తో భారతీయ జనతాపార్టీ ఐటీ వింగ్‌ సోషల్ మీడియాలను హైజాక్‌ చేస్తున్నదని, సొంత ఎజెండాను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజంగానే ఆ యాప్‌ మనకు తెలియకుండానే మన అభిప్రాయాన్ని మార్చేస్తుంది? మన మనసులపై మాయపొరలను కమ్మేస్తుందా? మన ఇష్టాఇష్టాలపై పెను ప్రభావం చూపిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నిజానికి టెక్‌ఫాగ్‌ అనేది ఓ ప్రైవేటు యాప్‌. అత్యాధునిక టెక్నాలజీలతో ఈ యాప్‌ను రూపొందించారు. బీజేపీ ఐటీ విభాగానికి చెందిన ఓ మాజీ ఉద్యోగి లాస్టియర్‌ ఏప్రిల్‌లోనే ఈ రహస్య యాప్‌ సంగతి వెలుగులోకి తీసుకొచ్చారు. తొలుత మీడియా ఫైల్‌ రూపంలో ఓ స్పైవేర్‌ను యాప్‌ నిర్వాహకులు రహస్యంగా పంపిస్తారు. దాని ద్వారా ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌లను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటారు.మనకొచ్చే మెసేజ్‌లను మనం లేక్‌ చేయాలని అనుకోకపోయినా ఆటోమాటిక్‌గా లైక్‌ చేసేస్తాం. అంటే మనం దేన్ని ఇష్టపడాలో దేన్ని వ్యతిరేకించాలో కూడా యాప్‌ నిర్దేశిస్తుందన్నమాట. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ సెక్షన్‌ను, ఫేస్‌బుక్‌లో ట్రెండ్‌ విభాగాన్ని టెక్‌ఫాగ్‌ ప్రభావితం చేస్తుంది. మనం ఏదైనా ట్వీట్‌ చేస్తే ఆటో రీట్వీట్‌, ఆటో షేర్‌ టూల్స్‌ ద్వారా యాప్‌ నిర్వాహకులు చాలా స్పీడ్‌గా రీట్వీట్ చేసేస్తారు. షేర్‌ చేస్తారు మన ప్రమేయం లేకపోయినా మనది కాని మన అభిప్రాయాలను వేగంగా వ్యాప్తి చేస్తారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేక నెటిజన్లు గందగగోళానికి గురవుతారు. మన ఫోన్‌ కనుక టెక్‌ ఫాగ్‌ బారిన పడితే మాత్రం మన వ్యక్తిగత సమాచారం, ఫోన్‌ నంబర్లు మొత్తం యాప్‌ నిర్వాహుకుగు గప్పిట్లోకి వెళ్లిపోయినట్టే! మన కాంటక్ట్స్‌ లిస్టులో ఉన్న నంబర్లలో ముఖ్యంగా అంతగా యాక్టివ్‌ లేని వాట్సప్‌ ఖాతాలను వాళ్లు హైజాక్‌ చేస్తారు. ఆ ఖాతాల నుంచే తమ మెసేజ్‌లను వ్యాప్తి చెందిస్తారు.ఈ విధంగా ప్రజాభిప్రాయాలను తారుమారు చేయవచ్చు. భారతీయ జనతాపార్టీ అనుబంధ యువజన సంఘం బీజేవైఎం చేస్తున్నది ఇదేనన్నది కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ఆరోపణ. కీలకమైన సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ ఫ్లాట్‌పామ్‌లను హైజాక్‌ చేయడానికి టెక్‌ఫాగ్‌ అనే అప్లికేషన్ను బీజేపీ ఐటీ సెల్‌ ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. టెక్‌ఫాగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విన్నవించుకుంటోంది. ప్రస్తుతం టెక్‌ఫాగ్‌ దేశ రాజకీయాలో ప్రకంపనలను సృష్టిస్తోంది. తిమ్మిని బమ్మి చేయడానికే ఈ యాప్‌ను రూపొందించారేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే దీనికి విస్తృత క్లౌడ్‌ డేటాబేస్‌ ఉండటం. ఇందులో అనేక మంది వ్యక్తుల ఉద్యోగం, మతం, మాతృభాష, వయసు, జెండర్‌, రాజకీయ అభిప్రాయాలు .. ఇలా ప్రతి ఒక్క సమాచారం విభాగాల వారీగా అందులో అందుబాటులో ఉంది. వ్యక్తుల రంగు, శరీర కొలతలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంది. వీటి ఆధారంగానే ఆయా గ్రూపులను నిర్వాహకులు టార్గెట్‌గా చేసుకుంటారు. వేధింపులకు గురి చేస్తారు.టెక్‌ ఫాగ్‌తో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ ఆరోపించారు. వ్యక్తుల గోప్యత హక్కును టెక్‌ఫాగ్‌ హరించివేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాప్‌పై చర్చించేందుకు హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌కు లేఖ కూడా రాశారు. ఈ అంశంపై చర్చించడం కోసం పార్లమెంటరీ స్థాయి సంఘం వెంటనే భేటీ అవ్వాలని కమిటీ ఛైర్మన్‌ ఆనంద్‌ శర్మను డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాను అధికార బీజేపీ కబ్జా చేస్తున్నదని, తమ భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్‌ అంటున్నారు. మహిళా జర్నలిస్టుల సహా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని టార్గెట్‌గా చేసుకుంటున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా ఆఫీస్ బేరర్లుగా కూడా ఉన్నారని శ్రీనెట్‌ అన్నారు. దీనిపై బీజేపీ పెదవి విప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలను బీజేపీ ప్రోత్సహిస్తున్నదని, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నదని కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. ఇంతకు ముందు ప్రస్తావించినట్టు బీజేపీ ఐటీ సెల్‌లో పని చేసిన ఆర్తి శర్మ ఈ గుట్టునంతా విప్పారు. బీజేపీ ఐటీ సెల్‌ కోసం ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయట. తాను కూడా టెక్‌ఫాగ్‌ అనే యాప్‌ను వాడినట్టు ఆమె చెప్పడం సంచలనంగా మారింది. రెండోసారి అధికారంలోకి వస్తే ఐటీ సెల్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు చేతులెత్తేసిందని ఆర్తి ఆరోపిస్తున్నారు. 67 మంది యాప్‌ ఆపరేటర్లు ఎలా వాట్సాప్‌ నెంబర్ల నుంచి సందేశాలు పంపిస్తున్నారో ఆర్తి స్క్రీన్‌ షాట్లతో సహా వివరించారు. బీజేపీ గొప్పతనాన్ని ప్రచారం చేయాలంటే యాప్‌లో బీజేపీ అనుకూల గ్రూపుల్లో సందేశం పంపుతారు. ఇక అక్కడి నుంచి లక్షలాది ఖాతాల్లోకి ఆ సందేశం అలా చక్కర్లు కొడుతుంది. ఏదైనా గ్రూపును కించపర్చాలంటే కూడా అంతే.టెక్‌ఫాగ్‌ అన్నది లేటెస్ట్ టెక్నాలజీ యాప్‌. అసలు ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఖాతాలతో సంబంధం లేకుండా టెక్‌ ఫాగ్‌ యాప్‌ పని చేస్తుంది. సొంతంగా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు క్రియేట్‌ చేస్తుంది. రీట్వీట్లు, ఫేస్‌బుక్‌లో పోస్టులను ఆటోమేటిక్‌గా షేర్‌ చేస్తుంది. ముందుగా టైప్‌ చేసి పెట్టిన సందేశాలతో ఆటోమేటిక్‌గా రిప్లైలు దానికదే పంపేస్తుంది. యాక్టివ్ గా లేని వాట్సాప్‌ నంబర్లను హైజాక్‌ చేసి, టోకెన్‌ థెఫ్ట్‌ అనే టెక్నాలజీ ద్వారా ఆ నంబర్ల నుంచి సందేశాలు పంపుతుంది. ముందుగా యాక్టివ్ గా లేని వాట్సాప్‌ నెంబర్లను టెక్‌ఫాగ్‌ యాప్‌ గుర్తిస్తుంది. భవిష్యత్తులో ట్రోలింగ్‌ చేసేందుకు వీలుగా వీరి ఫోన్ల ఆధారంగా వ్యక్తిగత వివరాల సేకరిస్తుంది టెక్‌ఫాగ్‌. ఈ యాప్‌ను రూపొందించింది పెర్సిస్టెన్స్‌ అనే సంస్థ. విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలకు బీజేపీ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

Related Posts