కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ అవినీతిలో కూరుకుపోయాయని... ఇంకా చెప్పాలంటే అవినీతితో పెనవేసుకున్నాయని నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని జస్టిస్ హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ పై తాను ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టిందని... తీరా ఆ పార్టీ అధికారంలోకి రాగానే తన నివేదికను అమలు చేయకపోగా... లోకాయుక్తను పక్కన పెట్టి, అవినీతి వ్యతిరేక బృందాన్ని నెలకొల్పిందని విమర్శించారు.బీజేపీ, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ... వాస్తవానికి రెండు పార్టీలు ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నాయని సంతోష్ హెగ్డే చెప్పారు. కర్ణాటక ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు సత్యాన్ని గౌరవించే స్థితిలో లేవని విమర్శించారు. నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చాయని మండిపడ్డారు. అభ్యర్థులపై ఉన్న ఆరోపణలను ఆయా పార్టీలు పట్టించుకోవడం లేదని... ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.