లక్నో, జనవరి 12,
బీఎస్పీ అధినేత మాయావతి యూపీకి నాలుగు సార్లు సీఎంగా పని చేసిన ఘనత ఆమెది. తాజాగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పదవి చేపట్టి మరోసారి చరిత్ర సృష్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఆమె తాజాగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త జాతీయ, తెలుగు మీడియాల్లో కనిపిస్తోంది. ఇందులో ఓ విషయం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆసక్తి కలిగించే ఆ విషయం గురించి మరింత తెలుసుకుందామని ముందుకు వెళ్లిన పాఠకుడు అసలు విషయం తెలుసుకుని నోరు వెల్లబెట్టాడు.. అసలు వార్తలో ఆ విషయం ఏమిటీ.. పాఠకుడికి ఎదురైన అనుభవం ఏమిటీ.. తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..యూపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల ప్రకటనపై పలు పార్టీలు దృష్టి సారించాయి. కాగా ఇంతలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేయబోరని విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది. ఆమెతో పాటు తానూ పోటీ చేయబోనని పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర వెల్లడించారు. దీనికి సంబంధించిన వార్త జాతీయ, తెలుగు మీడియాలు కవర్ చేశాయి. ఈ వార్తలో ‘మాయావతి ఇంత వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు’ అన్న విషయాన్ని రాసుకొచ్చారు.కాగా ఈ విషయం చాలా మందికి ఆసక్తిని కలిగించింది. రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎంగా పని చేసిన నేత ఒక్క సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదా. పైగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన నాయకురాలు మరి అసెంబ్లీ ఎన్నికల పట్ల ఎందుకు విముఖత చూపారని చాలా మంది ఆలోచనలు చేశారు. దీంతో అసలు దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అని రీసెర్చ్ మొదలు పెట్టారు. కానీ ఆమె గతంలో 1996-97లో సుహరాన్ పూర్ జిల్లా హరోరా నుంచి, 2002లోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి గెలిచారని విషయం తెలుసుకుని నిటూర్చడం పాఠకుని వంతైంది.