విశాఖపట్టణం, జనవరి 12,
బీచ్ కనిపిస్తే చాలు అలలతో ఆటాడుకోవాలనుకుంటారు. కానీ కొన్ని రాకాసి అలలు బీచ్‌కి వచ్చి సముద్రంలో సరదాగా దిగేవారిని తమతో లోపలికి తీసుకెళుతున్నాయి. తాజాగా విశాఖ సాగర తీరం ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ఆకర్షించే అలల వెనుక రాకాసి కెరటాలు కోరలు చాస్తున్నాయని ఎవరూ ఆలోచించడం లేదు. ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అర్థం అయ్యేలోపే ప్రమాదం పొంచి వుంటోంది. ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే నాథుడే కరువైపోతున్నాడు. బీచ్‌పై అవగాహన లేకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోంది.విశాఖ నగరానికి మణిహారంగా భావించే సముద్ర తీరం మృత్యుకుహరంగా మారుతోంది. యారాడ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సముద్రతీరం సుమారు 32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. యారాడ, కోస్టల్‌బ్యాటరీ, ఆర్కే బీచ్, తెన్నేటిపార్కు, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాల్లో నిత్యం వేలాది మంది స్నానాలకు సముద్రంలో దిగుతుంటారు. నగరానికి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు ఎవరైనా సరే ముందుగా బీచ్‌కు వెళ్లి ఆహ్లాదంగా గడపాలని చూస్తుంటారు. బీచ్‌కు వెళ్లిన తర్వాత ఒడ్డున కూర్చోగానే ఎగసిపడుతున్న కెరటాలను చూసి తన్మయత్వానికి గురై..సముద్రంలోకి దిగుతుంటారు.అంతే.. వారు మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావడం లేదు.విశాఖలో బీచ్‌ను సందర్శించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. దానికి తగ్గట్టుగా వసతులు కల్పించడం లేదు అధికారులు. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో సందర్శకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. బీచ్‌ను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటకులకు అవసరమైన భద్రత, ఇతర సదుపాయాలను కల్పించాల్సిన పోలీస్, జీవీఎంసీ, పర్యాటక శాఖాధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపం కారణంగా బీచ్ అంటే మృత్యుకుహరంగా మారుతోందని అంటున్నారు.
బీచ్‌లో ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది. ఎంత దూరం వరకూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలనే వాటిపై అధికారులు ఆలోచించడం లేదు. బీచ్ స్వభావంపై పర్యాటకులకు అవగాహన కలిగేలా ప్రతీచోటా దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచాలి. గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ తర్వాత కాలంలో నిర్వహణ లేకపోవడంతో చాలా వరకూ కనుమరుగైపోయాయి. బీచ్‌లో మరణాలను తగ్గించడంతోపాటు ఆపదలో చిక్కుకున్న వారిని సకాలంలో గుర్తించి సహాయ చర్యలు అందించేందుకు వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల కిందట ప్రతిపాదనలు రూపొందించారు. ఈ వాచ్ టవర్‌పై నిత్యం ఇద్దరు పోలీసులు పహారా కాయడంతోపాటు వారికి బైనాక్యులర్స్, సముద్రంలో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు సిబ్బందికి స్విమ్ సూట్ లాంటి పరికరాలను అందించాలి.ఇలాంటివి ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉండిపోయాయి. దీనిపై పోలీసులు పలుమార్లు ప్రస్తావించినా జీవీఎంసీ నుంచి స్పందన లేకపోవడంతో మిన్నకుండిపోయారు. లైఫ్‌జాకెట్లు లాంటివి అందుబాటులో ఉంటే ప్రమాదంలో చిక్కుకున్నవారిని గుర్తించి సమీపంలో ఉన్నవారు వాటి సాయంతో రక్షించేందుకు వీలుంటుంది. తీరం పొడవునా ప్రతి 15 మీటర్ల దూరానికి ఒక లైఫ్ గార్డును ఏర్పాటు చేయాలి. దీనివల్ల సమీపంలో ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు వీలుంటుంది. పర్యాటక రంగానికి బీచ్ అత్యంత కీలకమైంది. బీచ్‌కు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ‘బీచ్ పోలీసు’ పేరుతో పర్యాటకశాఖ కొత్త విభాగం ఏర్పాటుకు ప్రతిపాదించింది. కొంతమంది గజ ఈతగాళ్లను బీచ్ పొడువునా నియమించి వారికి జీతభత్యాలు, రక్షించేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఐతే ఏళ్లు గడుస్తున్నా దీనిపై పురోగతి మాత్రం కనిపించడంలేదు.తీరం దిశగా వచ్చే కెరటంలో మధ్య భాగం తిరిగి వెనక్కి వెళ్లే సమయంలో ఏర్పడే తీవ్రతను రిప్ కరెంట్ అంటారు. కెరటం మధ్య భాగంలో ఉండే వ్యక్తి రిప్ తీవ్రతకు గురై కెరటంతోపాటు సముద్రం లోపలికి వెళ్లిపోతాడు. ఇలాంటి సమయంలో ప్రమాదం నుంచి బయట పడాలంటే…వెనక్కి వెళ్లే కెరటంతోపాటు నిటారుగా ఈదకూడదు. దీనికి బదులు కుడి, లేదా ఎడమ వైపునకు వెళ్లే విధంగా ప్రయత్నించాలి. అప్పుడే సురక్షితంగా బయటపడతారు. లేకపోతే కెరటం వెనక్కి వెళ్లే క్రమంలో దాంతోపాటు లోపలికి వెళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అమావాస్య-పౌర్ణమి నాడు ఇలాంటి అలలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే విశాఖ సాగర తీరం స్నానాలకు..ఎంజాయ్ చేయ్యడానికి ప్రమాదమని తేల్చారు నిపుణులు.