YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఈల్లిగల్ మెట్రాలజీ....

ఈల్లిగల్ మెట్రాలజీ....

హైదరాబాద్, జనవరి 12,
తూనికలు కొలతలశాఖ (లీగల్‌ మెట్రాలజీ)... ఫిర్యాదు చేస్తే తప్ప, స్వచ్ఛందంగా స్పందించే లక్షణం లేదనే నింద ఎప్పటినుంచో దానిపై ఉంది. ఆలస్యంగా అయినా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారాలని ఆ శాఖాధికారులు ఇటీవల నిర్ణయించారు. సాంకేతికతలోకి మారాలంటే...ముందు ట్రయల్స్‌ వేయాలి. లోపాలను దిద్దుకుంటూ క్రమేణా సేవలను పెంచుకోవాలి. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవల్ని కొనసాగిస్తూనే ఉండాలి. కానీ లీగల్‌ మెట్రాలజీ అధికారులు సర్కారీ రెవెన్యూ శాఖ 'ధరణి' వెబ్‌సైట్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ సేవల్ని ప్రకటించేశారు. అదికాస్తా పద్మవ్యూహాన్ని తలపించి, నానా తిప్పలు పెడుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఆ గందరగోళం నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక ఆ శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 24వ తేదీ నుంచి ఆ శాఖ కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. వీరి చర్యతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఆటో, ట్యాక్సీలకు ఏటా మీటర్‌ సీల్‌ను ఈ శాఖ వారే వేస్తారు. వందరూపాయలు చలానా కడితే, మీటర్‌ను చెక్‌చేసి, సీల్‌ వేస్తారు. ఆ సీల్‌ ఉంటేనే ఆర్టీఏ కార్యాలయాల్లో ఫిట్‌నెస్‌కు అనుమతిస్తారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే, ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. ఇలా ఒకదానికొకటి గొలుసుకట్టు విధానం అమల్లో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అత్తాపూర్‌, సరూర్‌నగర్‌లోని సింగరేణి కాలనీల్లో మాత్రమే మీటర్‌ సీల్‌ కార్యాలయాలు ఉన్నాయి. డిసెంబర్‌ 24 నుంచి వీటిని మూసేశారు. ఆటో, ట్యాక్సీ యజమానులు మీటర్‌ సీల్‌కు ఆన్‌లైన్‌లో చలానా కట్టి, నమోదు చేసుకోవాలని నిబంధనల్ని మార్చారు. దీనితో ఆయా వాహనాల యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే, వాటిని స్వీకరించినట్టు మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. మీటర్‌ సీల్‌ కోసం వెళ్తే, డేటా అప్‌డేట్‌ కాలేదంటూ అక్కడి సిబ్బంది తిప్పి పంపిస్తున్నారు. మీటర్‌ సీల్‌ గడువు ముగిసినా, రెన్యువల్‌ చేసుకోలేదని ట్రాఫిక్‌, ఆర్టీఏ అధికారులు చలానాలు విధిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వాహనానికి ఫిట్‌నెస్‌ లేదనే కారణంతో ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను తిరస్కరిస్తున్నారు. రెండు వారాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది సాంకేతికంగా సమస్యలు ఉన్నాయంటూ సమాధానాన్ని దాటవేశారు. పాతపద్ధతిలో సీల్‌ ఎందుకు వేయట్లేదు అని ప్రశ్నిస్తే ..ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని సమాధానం చెప్తున్నారు.ఆటో, ట్యాక్సీ మీటర్‌ సీల్‌ అంశం రవాణాశాఖ, బీమా కంపెనీలతో ముడిపడి ఉంది. రెండు వారాలుగా మీటర్‌ సీల్‌ నిలిపివేయడంతో కాల పరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్‌కు వస్తున్నారని రవాణాశాఖ అధికారులు పెనాల్టీలు విధిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ వర్తించట్లేదు. మీటర్‌ సీల్‌ను కూడా రవాణాశాఖ పరిధిలోకి తేవాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు కడితే, లీగల్‌ మెట్రాలజీ వెబ్‌సైట్‌లో చూపించట్లేదు. అప్లికేషన్‌ సబ్మిట్‌ అయినట్టు మెసేజ్‌లు వస్తున్నాయి. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, ఓనర్ల బతుకంతా ట్రాఫిక్‌, ఆర్టీఏ చలాన్లు కట్టడానికే సరిపోతున్నది. తక్షణం ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts