వరంగల్, జనవరి 12,
కాలం మారింది. ఇప్పుడు అధికారులెవ్వరూ నేరుగా లంచం తీసుకోవట్లే. గోడకు సీసీ కెమెరాలు, ఫోన్లలో రికార్డింగులు వచ్చినప్పటి నుంచి బల్లాకింద చేతులు పెట్టట్లేదు. ఏది ఉన్నా.. సామరస్యంగానే అవినీతికి పాల్పడుతున్నారు. మధ్యవర్తులను పెట్టుకొని లంచాల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో లంచానికి ఓ కొత్త టర్మినాలజీ కూడా ఉంది. ఉదాహరణకు ఆఫీస్ చార్జ్, ఫార్మాలిటీ, స్పెషల్ ఫీజు వంటి పదాలను విస్తృత అర్థంలో లంచానికి వాడుతున్నారు. మహానగరంలో ఇంటి పర్మిషన్ తీసుకునే సమయంలో పైన పేర్కొన్న పదాలు తరచూ వినిపిస్తాయి. ఆయా విభాగాల అధికారులకు మధ్యవర్తుల ద్వారా కనీసం లక్ష రూపాయలైనా చదివించుకోవాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం సేవల్లో సులభతరం, సత్వ రం, పారదర్శకం కోసం టీఎస్–బీపాస్‌ను తీసుకొ చ్చింది. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణమే భవన నిర్మాణ పర్మిషన్ తీసుకోవచ్చు. కానీ.. ప్రజలకు టీఎస్–బీపాస్‌పై అవగాహన లేక బల్దియా లైసెన్స్ సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులు, ప్లాన్‌లు, ఫీజుల సొమ్ము సైతం నెట్ బ్యాంకింగ్ ద్వారా స్వీకరిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతను మహా నగర పాలక సంస్థ గుర్తింపు పొందిన ప్రైవేట్ లెసెన్స్ సర్వేయర్లకే అప్పగించింది. దీంతో ప్రైవేటు సర్వేయర్లు అదనపు వసూళ్లతో భవన నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కాస్త చదువుకున్న వారు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు సొంతంగా పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు పర్మిషన్ అప్రూవల్ చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి.కొత్తగా ఇంటికి పర్మిషన్ తీసుకోవాలంటే ఇంటి వైశాల్యాన్ని బట్టి కొంత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇది నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. కానీ.. నక్షాలు (ప్లాన్) గీసే లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఒక ప్లాన్ గీస్తే ఎంత తీసుకోవాలి అనేదానిపై స్పష్టత లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మహానగరంలో కొత్త ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చే వారి నుంచి ఆన్‌లైన్ పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బిల్డింగ్ ప్లాన్‌లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు లైసెన్స్‌డ్ ప్రైవేట్ సర్వేయర్లు పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ప్లాన్ గీసేందుకు ముందు ప్రైవేటు సర్వేయర్ ప్లాట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొలతల ప్రకారం ప్లాన్(నక్ష) గీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా రెండు, మూడు గంటల వ్యవధిలో పూర్తవుతుంది! కానీ.. ఇందుకు సర్వేయర్లు వేలల్లో ఫీజు వసూలు చేస్తుంటారు.సర్వేయర్ గీసిచ్చిన ప్లాన్ ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఫైల్‌ను ఉన్నతాధికారుల వద్దకు పంపిస్తారు. ఆ తర్వాత వారు డాక్యుమెంట్లు వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తారు. పర్మిషన్ కోసం వచ్చిన వారి నుంచి సర్వేయర్లు ముందుగా తక్కువ మొత్తంలో నగదు తీసుకుంటారు. ఆ తర్వాత ఆన్‌లైన్, వివిధ కారణాల పేరుతో అదనపు పైకం కావాలని వేధిస్తారు. ప్రజలెవరైనా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రైవేట్ సర్వేయర్లు మాకేం సంబంధం? మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి.. అంటూ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. మహా నగర పాలక సంస్థ నుంచి లైసెన్స్ పొందిన సర్వేయర్లు 85 మంది వరకు ఉంటారు. ఏడాదికోసారి లైసెన్స్ రెన్యూవల్ కోసం రూ.10వేలు చెల్లిస్తారు. భవన నిర్మాణాలు, నల్లా కనెక్షన్లకు సంబంధించిన ప్లాన్‌లు వీరు గీసి ఇవ్వాల్సి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల పరిధిలో వీరంతా పని చేయాలి. పేరుకు మాత్రం ప్రైవేట్ సర్వేయర్లు అయినా.. తెర వెనుక మాత్రం సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు తొందరంగా రావాలంటే వీరి ద్వారా వెళ్లాల్సిందే. టౌన్ ప్లానింగ్ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిలా(మధ్యవర్తులుగా) పని చేస్తున్నారు. కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో కొందరు బడా సర్వేయర్ల కనుసన్నల్లో బిల్డింగ్ అనుమతుల ఫైళ్లు పరిష్కారమవుతున్నాయనేది బహిరంగ రహస్యమే. గతంలో మాన్యువల్ విధానం ఉన్నప్పుడు బిల్డింగ్ ప్లాన్ గీసేందుకు రూ.3వేల నుంచి రూ.4వేలు తీసుకునే వారు. గత నాలుగేళ్లుగా ఆన్‌లైన్ బిల్డింగ్ అప్లికేషన్ విధానం అమల్లోకి వచ్చింది. భవన నిర్మాణ ప్లాన్, దస్తావేజులు తదితర వివరాలన్నీ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పి ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఆన్‌లైన్ సేవలకు అదనపు రుసుములని చెబుతున్నారు. ఇదే విషయమై గతంలో చాలామంది టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ.. తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఆధునిక సేవలు నగర ప్రజలకు అదనపు భారంగా మారాయి.