తిరువనంతపురం, జనవరి 13,
భార్యల మార్పిడి కేసులో మరిన్ని సంచలన వివరాలు బయటికొస్తున్నాయి. కేరళలో ఈ ఇల్లీగల్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళ డీజీపీ అనిల్ కాంత్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ పోలీస్ అధికారుల బృందం దర్యాప్తు చేస్తోంది. ఆ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. భార్యల మార్పిడి బాగోతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలే ఎక్కువ మంది ఉన్నారని దర్యాప్తులో తెలుస్తోంది. మూడన్నరేళ్లుగా.. దాదాపు వెయ్యి జంటలతో ఈ యవ్వారం సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి.. సీక్రెట్‌గా పార్ట్‌నర్స్‌ను మార్చుకుంటున్నారు. భార్యల మార్పిడి రాకెట్ సభ్యుల మొబైల్ ఫోన్ల నుంచి రికవరీ చేసిన ఛాట్‌లు, కాల్ వివరాలను విశ్లేషించి 14 సోషల్ మీడియా గ్రూపులను పోలీసులు గుర్తించారు. భర్త-భర్యలను మార్పిడి చేసుకోవాలనుకునే వ్యక్తులు.. 'మీట్ అప్ కేరళ', 'కేరళ కకోల్డ్', 'రియల్ మీట్' వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఇంకొకరి భార్య లేదా భర్తపై ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ ఫొటోలను, లొకేషన్ వివరాలతో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో షేర్ చేస్తూ.. వారి ప్రత్యేక కోరికలను వ్యక్తం చేస్తూ.. డీల్స్ కుదుర్చుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ వెయ్యి మంది జంటలు జరిపిన సీక్రెట్ చాట్‌లు.. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతాల్లో ఉన్నాయని దర్యాప్తు చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ ముఠాలో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుందని... ఓ భర్తకు గల్ఫ్ దేశంలో ఉద్యోగం రావడంతో ఆయన వెళ్లి పోవడంతో అతని భార్య గ్రూపులో చేరిందని.. ఇలా అనేక విభిన్న బ్యాక్‌గ్రౌండ్స్‌కు చెందిన వారున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ గ్రూపు సభ్యులు ఇతరులతో కలిసి చేస్తున్న వీడియోను చిత్రీకరించి, దాన్ని కుటుంబసభ్యులకు పంపుతామని బెదరించి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటనలూ ఉన్నాయని విచారణలో వెల్లడవుతోంది. పూర్తి దర్యాప్తునకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది.