విజయవాడ, జనవరి 13,
చంద్రబాబు కు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనుభవం పెంచుకున్నారు. కానీ అదే సమయంలో రాజకీయాల్లో శత్రువుల సంఖ్య కూడా చంద్రబాబుకు పెరిగింది. ఆయన పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలు చంద్రబాబుకు వచ్చే ఎన్నికలకు శాపంగా మారనున్నాయేమోనని పిస్తుంది. శత్రువులు ఒక్కరు కాదు అనేక మంది చంద్రబాబు మరోసారి సీఎం కాకూడదని కోరుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదు. ఆయన ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా జనసేనతో కలసి వెళ్లాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకూ దానిని ఊహాగానాలుగా కొట్టిపారేసినా ఆయన మాటలు, చేష్టలతో జనసేన లేనిది ఎన్నికలకు వెళ్లలేరనిపిస్తుంది. అయితే ఇప్పడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మరో కూటమి తయారయ్యేటట్లే కన్పిస్తుంది. దీని వెనక ఎవరున్నారన్నది పక్కన పెడితే వీరి ఉద్దేశ్యం చంద్రబాబు అధికారంలోకి రాకూడదన్నదే అంతిమలక్ష్యం. అవసరమైతే ఓట్లను చీల్చి అధికార పార్టీకి లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశ్యం కనపడుతుంది. చంద్రబాబుకు కనపడే శత్రువులు కొందరైతే, కనపడని శత్రువులు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా ఒక్కటైనట్లు కనపడుతుంది. ముద్రగడ పద్మనాభం నేరుగా కొత్త పార్టీని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సక్సెస్ అవుతుందో లేదో పక్కన పెడితే ఆయన నేరుగా చంద్రబాబుకు శత్రువుగానే కన్పిస్తున్నారు. ఆ కానీ గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు చంద్రబాబుకు కనపడని శత్రువులంటున్నారు. వీరంతా కాపునేతలతో ఇటీవల తరచూ రహస్య సమావేశాలు జరుపుతున్నారు. వీరి అంతిమ లక్ష్యం ఒక్కటే. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకూడదు. ఆయన సాయం తీసుకుని కాపు నేతను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. వారి టార్గెట్ అదే. చంద్రబాబు వల్ల రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన వారంతా ఒకచోటకు చేరుతున్నారు. మరి ఈ శత్రువుల నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.