YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రమాదంలో కాటన్ బ్యారేజీ

ప్రమాదంలో కాటన్ బ్యారేజీ

రాజమండ్రి, జనవరి 13,
గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే కాటన్ బ్యారేజీ ప్రమాదంలో పడింది. మరమ్మతులు లేక.. రాను రాను బ్యారేజీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆధునీకరణకు నోచుకోక, మరమ్మతులకు గురై డేంజర్ పరిస్థితిలో పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యారేజీ మనుగడ పెంచుతుందా ? కాసులిచ్చి కాపాడుతుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్ బ్యారేజీ సామర్థ్యం, రోజు రోజుకు తగ్గిపోతుంది. కాటన్‌ బ్యారేజీ పునర్నిర్మాణం జరిగి అయిదు దశాబ్దాలు దాటుతున్నా.. ఆధునికీకరణకు నోచుకోలేదు. కాటన్‌ కలలరూపం.. పదికాలాలు సేవలందించాలంటే, బ్యారేజీలో నీటి విడుదల వేళ ఎదురవుతున్న సాంకేతిక లోపాలు అధిగమించాలి. ఉగ్ర గోదావరికి అడ్డుకట్ట వేసే గేట్ల సామర్థ్యం మరింత పెంచాలి. నిర్వహణ సమర్థంగా సాగేలా చొరవ చూపాలి. ఈ పనులు అన్ని చేపట్టాలంటే.. ముందు మరమ్మతులకు ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాల్సి ఉంది.తూర్పు- పశ్చిమ- మధ్య డెల్టాల పరిధిలో 10 లక్షల 16 వేల ఎకరాలకు కాటన్ బ్యారేజీ ద్వారా సాగునీరు అందుతోంది. జిల్లాలో ఖరీఫ్‌- 2021లో 136 టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందిస్తే.. సముద్రంలోకి 2 వేల 463 టీఎంసీలు వదిలేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల 21 వేల ఆయకట్టు ఉంటే.. ఈ రబీలో ఈ జలాలే కీలకంగా మారాయి. ఇక బ్యారేజీపై ప్రయాణం అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు కిలోమీటర్లు పొడవు ఉన్న రోడ్డు అధ్వాన్న స్థితి చేరింది. బ్యారేజీకి మరమ్మతులు చేపట్టి మనుగడ పెంచాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు.డ్రిప్‌-2 కింద 2019లో 61 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపారు. ఈ నిధులతో బ్యారేజీకి 175 స్పిల్‌వే గేట్లు ఉన్నాయి. ఇవి తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి. గేట్లకు అనుసంధానంగా ఐరన్‌ రోప్‌, బేరింగ్‌ల వ్యవస్థ ఉంది. వీటిని పునరుద్ధరిస్తే గేట్లు తీయడం.. మూయడం సులువై.. లీకేజీలు అరికట్టే వీలుంది. గేట్ల నిర్వహణకు వీలుగా విద్యుత్తు ఆపరేషన్‌ సిస్టమ్‌ పునరుద్ధరించాలి. సాంకేతికతతో కూడిన కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టం, జనరేటర్లు అందుబాటులోకి తేవాలి. ఎక్స్‌స్ట్రాన్షన్‌ జాయింట్లు పనితీరు సమీక్షించాలి. వరద తగ్గిన తర్వాత బురద పోయేలా చూసే మూడు స్కవర్‌ స్లూయిస్‌లు పటిష్టపరచాలి.~~మూడు డెల్టాలకు మూడు హెడ్‌ స్లూయిస్‌ల తలుపుల మరమ్మతులు చేయాలి.6 కిలో మీటర్లు బ్యారేజీ సుందరీకరణ కింద ధవళేశ్వరం-విజ్జేశ్వరం రోడ్డు పునరుద్ధరించాలి. తక్షణం నిధులు విడుదల చేస్తే ఈ పనులు అన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి వంద కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావాల్సి ఉందని, వస్తే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా ఆధ్వర్యంలోని డ్యామ్‌ సేఫ్టీ కమిటీ రెండు రోజులు బ్యారేజీని సందర్శించింది. కమిటీ ఈ మేరకు ఓ నివేదిక సిద్ధం చేస్తుంది. త్వరలో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. డ్యామ్‌ సేఫ్టీ కమిటీ సందర్శనతో.. ఇప్పటికైనా కాటన్ బ్యారేజీ మరమ్మతులకు నోచుకుంటుందనే భరోసా దక్కుతుందనేది అందరి ఆకాంక్ష.

Related Posts