పాడేరు నియోజకవర్గం వైసీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీలో చేరిన తరువాత అంతంతమాత్రంగా వున్న వైసీపీ పరిస్థితి, పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలతో మరింత క్షీణస్థితికి చేరుకుంటున్నది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పరీక్షిత్‌రాజ్, అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలపై నియోజకవర్గ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని నియమించడాన్ని పలువురు నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. శనివారం చింతపల్లి గిరిజన భవన్‌లో రహస్యంగా సమావేశమైన నియోజకవర్గ ముఖ్యనాయకులు, బహిరంగ ఆందోళనకు సిద్ధపడుతున్నారు. పరీక్షిత్‌రాజ్ పార్టీ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించి కేవలం ఐదు నెలల కిందట పార్టీలో చేరిన భాగ్యలక్ష్మిని సమన్వయకర్తగా నియమింపజేశారని నియోజకవర్గం వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు నియోజకవర్గం వైసీపీ నాయకుల అంతర్గత విభేదాలు కొవ్వొత్తుల ర్యాలీలతో బయటపడ్డాయి. బాలికలు, మహిళలపై అత్యాచార సంఘటనలకు నిరసనగా నియోజకవర్గం కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. శనివారం చింతపల్లిలో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం వైసీపీ ముఖ్యనాయకులు... జి.మాడుగుల మాజీ ఎంపీపీ వెంకట గంగరాజు, చింతపల్లి జడ్‌పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, అడపా విష్ణుమూర్తి, గోవర్దన్‌గిరి, త్రినాథ్‌పడాల్, రత్నాబాయ్, గిడ్డి విజయలక్ష్మి, బూసరి కృష్ణారావు, ఉల్లి సత్యనారాయణ, విజయకుమారి, నాగజ్యోతి, తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మరోవైపు పాడేరు నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పాడేరులో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.
పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నియమించడంపై పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చింతపల్లి గిరిజన్ భవన్‌లో సమావేశమైన పార్టీ ముఖ్య నాయకులు... నాలుగేళ్లగా పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకులకు కనీస గుర్తింపులేదని, పరీక్షిత్‌రాజ్ తీసుకుంటున్న నిర్ణయాలు, అధిష్ఠానం తీరుపై ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. భాగ్యలక్ష్మి సమన్వయకర్తగా నియమిస్తే పార్టీ బలహీనపడుతుందని విజయసాయిరెడ్డికి విన్నవించుకున్నా, కనీసం పట్టించుకోలేదని, పార్టీ అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకోవాలని ఈ సమావేశంలో ముఖ్యలు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు భాగ్యలక్ష్మి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని పీకే బృందం నాయకులు బెదిరిస్తున్నారని నాయకులు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లను అమ్ముకుంటున్నారని, సామాజిక న్యాయం జరగడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
తనతో పాటు టీడీపీలో చేరాలని తనకు అత్యంత సన్నిహితురాలైన చింతపల్లి జడ్‌పీటీసీ సభ్యురాలు పద్మకుమారిని.... పాడేరు గిడ్డి ఈశ్వరి అప్పట్లో కోరారు. కానీ తాను వైసీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గ సమన్వయకర్త నియామకంలో తన అభిప్రాయం తీసుకోకుండా పార్టీ అధిష్ఠానం భాగ్యలక్ష్మిని నియమించడంపై పద్మకుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమన్వయకర్త భాగ్యలక్ష్మి, పరీక్షిత్‌రాజ్‌కి వ్యతిరేకంగా నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు భారీస్థాయిలో నిరసర కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అప్పటికీ అధిష్ఠానం తీరు మారకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
పాడేరు వైసీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం, అధిష్ఠానం కూడా నాయకులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో కొంతమంది నాయకులు ఎమ్మెల్యే ఈశ్వరికి టచ్‌లో వున్నట్టు తెలుస్తున్నది. అయితే భాగ్యలక్ష్మిని సమన్వయకర్తగా నియమించామే తప్ప ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తున్నట్టు అధిష్ఠానం హామీ ఇవ్వలేదంటూ కొందమంది నాయకులు, అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. భాగ్యలక్ష్మి అనుచరులు మాత్రం ఆమెకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వనున్నట్టు అధినేత జగన్ హామీ ఇచ్చారని చెప్పకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరడానికి ఎమ్మెల్యే ఈశ్వరి వద్ద సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.