YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నరసాపురంలో తమ్ముళ్ల తన్నులాట

నరసాపురంలో తమ్ముళ్ల తన్నులాట

రాజకీయ పార్టీలలో అంతర్గత విభేదాలు ఉండొచ్చు. కానీ అవి కొంతవరకే పరిమితం కావాలి. శ్రుతిమించితే మాత్రం పార్టీకే కాదు, నేతలకు కూడా కష్టమే! పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టీడీపీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్ పర్సన్‌ల మధ్య విభేదాలు తారస్ధాయికి చేరాయి. ఒక అధికారి బదిలీ వ్యవహారం వారి మధ్య రగడను మరింత రాజేసింది. ఎమ్మెల్యే వైఖరితో కినుక వహించిన ఛైర్ పర్సన్‌తో పాటు పదహారు మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో అధిష్టానం జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా ఆ వివాదం సద్దుమణిగింది. అయినప్పటికీ అది నివురుగప్పిన నిప్పులా లోలోపల సెగలు కక్కుతూనే ఉంది.

నరసాపురం మున్సిపాలిటీలో మొదటినుంచి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడికి, మున్సిపల్‌ ఛైర్ పర్సన్ పసుపులేటి రత్నమాలకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పురపాలక వ్యవహారాల్లో ఎమ్మెల్యే మాధవనాయుడు జోక్యం చేసుకుంటున్నారన్నది రత్నమాల అభియోగం! తన పరిధి మేరకే తాను వ్యవహరిస్తున్నానన్నది ఎమ్మెల్యే వాదన! అంతేకాదు, మున్సిపాలిటీలో వివిధ కాంట్రాక్టులకు సంబంధించి కూడా వీరిమధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దాంతో వ్యవహారం ఎడమొహం- పెడమొహంగా మారింది. దీనికి ప్రోటోకాల్ వివాదాలు ఆజ్యం పోశాయి. ఫలితంగా ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్‌ మధ్య మరింత దూరం పెరిగింది. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అధిష్టానం ఒకటి రెండుసార్లు జోక్యం చేసుకుని సర్థిచెప్పింది. అయినప్పటికీ అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరారో అప్పటినుంచి నరసాపురం రాజకీయాల తీరే మారిపోయింది. అంతకుముందు వరకూ ఎమ్మెల్యే, ఛైర్ పర్సన్‌ల మధ్య మనస్పర్ధలు మాత్రమే ఉండగా, అవి కాస్తా వర్గాలు ఏర్పాటుచేసుకునే స్థాయికి చేరాయి. తాజాగా నరసాపురంలో ఎమ్మెల్యే గ్రూపు, ఛైర్ పర్సన్ గ్రూపు వైరివర్గాల మాదిరిగా తయారై ఆధిపత్యపోరుకు తెరతీశాయి.

నరసాపురం పురపాలక సంఘంలో 31 వార్డులుంటే, అందులో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ చెరి 14 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన మూడు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్ధులు గెలుపొందారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు సహా స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో జెండా ఎగురవేసింది. ఈ తరుణంలోనే అధికారపక్ష నేతల్లో లుకలుకలు మొదలయ్యాయి. సరిగ్గా ఈ సమయంలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వైసీపీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు సైతం టీడీపీలో చేరారు. ఛైర్ పర్సన్ రత్నమాలకు కొత్తపల్లి వర్గం మద్దతుగా నిలిచింది. దీంతో ఆమెకంటూ ఒక బలమైన వర్గం ఏర్పడింది. అన్ని విషయాల్లో పైచేయి కోసం పావులు కదిపింది.

 నరసాపురం మున్సిపాలిటీలో అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరింది. ఈ పోరు వల్లే గత మూడేళ్ల వ్యవధిలో తొమ్మిది మంది కమీషనర్లు మారారు. ముగ్గురు డిఇలు ఛేంజ్‌ అయ్యారు. కమీషనర్లు, డిఇల నియామకంలో ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రమేయం ఉంటోంది. ఇది గిట్టని రత్నమాల వర్గం ఏదో ఒక రకంగా వారిపై వత్తిడి తెస్తోంది. ఆయా అధికారులపై రకరకాల ఆరోపణలు గుప్పిస్తోంది. ఫలితంగా, వచ్చిన అధికారులు వెంటనే వెళ్లిపోతున్నారు.

మున్సిపాలిటీలో పరిస్థితులు వికటించడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. తాజాగా డిఇ శ్రీకాంత్ బదిలీ వ్యవహారాన్ని పరిశీలిస్తే... స్థానికంగా సాగుతున్న వర్గపోరు ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. డిఇ శ్రీకాంత్ సక్రమంగా పనిచేయడం లేదనీ, అవినీతిపరుడనీ ఆరోపిస్తూ ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ సమావేశంలో రత్నమాల ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేశారు. అయితే సాధారణ బదిలీలు జరిగే సమయంలో శ్రీకాంత్‌ను మరో చోటికి పంపిస్తామనీ, అప్పటివరకు అక్కడే కొనసాగిస్తామనీ పేర్కొంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం అలా స్పందించడానికి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడే కారణమని ఆరోపిస్తూ మున్సిపల్‌ ఛైర్ పర్సన్ రత్నమాల సహా 16 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇందులో విచిత్రం ఏమిటంటే, రాజీనామాలు చేసిన కౌన్సిలర్లలో ఎక్కువ మంది వైసీపీ నుంచి గెలుపొంది, తర్వాత టీడీపీలోకి వచ్చిన వారే కావడం! టీడీపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు మాత్రం తటస్ధంగానే ఉన్నారు. ఛైర్ పర్సన్ సహా కౌన్సిలర్లు రాజీనామాలు చేయడంతో టీడీపీ అధిష్టానం ఒక్కసారిగా కంగుతిన్నది. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి అప్పగించింది. రంగంలోకి దిగిన ఆమె, ఛైర్ పర్సన్ రత్నమాల వర్గంతో చర్చలు జరిపారు. రాజీనామాలు ఉపసంహరింపచేయడంలో విజయం సాధించగలిగారు. అయితే ఈ పరిణామాలు టీడీపీలో అంతర్గత చర్చకు దారితీశాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో, ఈ విభేదాల వలన పార్టీ నష్టం పోతుందనేది కొందరు నేతల వాదన. నరసాపురం సమస్యకి పార్టీ పెద్దలు ఏ పరిష్కార మార్గం అన్వేషిస్తారో వేచిచూడాలి!

Related Posts