YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గడ్డికూడా మొలవని నేలలో ఆపిల్ బేర్ పళ్లు

గడ్డికూడా మొలవని నేలలో ఆపిల్ బేర్ పళ్లు

కాకినాడ, జనవరి 16,
ప్రకృతి ఆటు పోట్లు, ధరాఘాతం అన్నదాతను కుంగదీస్తున్నాయి. ప్రతీ సంవత్సరం కష్ట నష్టాలే గానీ పెట్టుబడులు తేలని సేద్యంతో సాగుదారులు బేజారవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడారిలో ఒయాసిస్సులా ఎదురైంది ఆపిల్‌ బేర్‌. గంగి రేగు కంటే  పెద్ద పరిమాణంలో, యాపిల్‌ ఆకారంలో ఉండే ఈ పండ్లను ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పండిస్తున్నారు. దిగుబడులతో పాటు మంచి మార్కెట్‌తో లాభాలార్జిస్తున్నారు సాగుదారులు.యాపిల్‌ బేర్‌ చూడ్డానికి గంగరేగిపండుకు ఎక్కువలా… యాపిల్‌ పండుకు తక్కువలా ఉంటుంది. ఎక్కడో థాయిలాండ్‌లో పురుడు పోసుకుని బంగ్లాదేశ్‌ మీదుగా మన దేశంలోకి అడుగుపెట్టింది. యాపిల్‌ పండుకు పోటీగా నిలిచింది.  భూమి ఏదైనా కాయ కష్టం చేసే రైతు దృష్టి సారిస్తే...పండించలేని పంట లేదని నిరూపిస్తున్నారు అనపర్తి ప్రాంత రైతు కర్రి సూరారెడ్డి. గడ్డి కూడా మొలవని నేలలో బేర్ యాపిల్ పండిస్తూ లాభాలు బాట పడుతున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ యాపిల్‌ బేర్‌ మొక్కలను...  రైతు సూరారెడ్డి తీసుకువచ్చి నిరుపయోగంగా ఉన్న 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని ఏడాది కిందట బేర్ యాపిల్ మొక్కలు నాటాడు. ఏడాది గడవక ముందే పంట చేతికి రావటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్కలకు సోలార్ విద్యుత్ తో వచ్చే నీటిని అందిస్తున్నారు. దీనికి డ్రిఫ్ పద్దతిని ఎంచుకోవడంతో నీటిని ఆదా చేస్తున్నాడు. కిలో యాపిల్ బేర్ పళ్లు 40 రూపాయలకే అమ్మకం చేస్తున్నారు.  తొలి ఏడాదిలోనే చెట్టుకు 10 కేజీల చొప్పున యాపిల్‌బేర్‌ కాయలు వస్తున్నాయి. కొంతకాలం పోయాక చెట్టుకు 250 కేజీల వరకు యాపిల్‌బేర్‌ కాయలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.  యాపిల్‌ బేర్‌ చెట్టు మొండిజాతి. ఇది వందేళ్ల వరకు దీని జీవిత కాలం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు కురిపిస్తూ.. రైతుల పాలిట కల్పవృక్షంలా మారింది. ఈ ఆపిల్ బేర్ సాగుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాదించవచ్చు.  ఈలాంటి రకం పంటలపై రైతులలో అవగాహనా కల్పించి ప్రభుత్వం నుంచి రుణాలు ఇస్తే ఇంకా చాల మంది రైతులు ఈ పంటను సాగు చేస్తారంటున్నాడు రైతు సూరారెడ్డి.

Related Posts