అమరావతి జనవరి 17
జగన్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులకు టీడీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అధికార పార్టీ అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. కరోనా దృష్ట్యా 12కిపైగా రాష్ట్రాల్లో స్కూళ్లు మూసివేశారని చెప్పారు. ఏపీలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్లు పెట్టడం దుర్మార్గమన్నారు. స్కూళ్ల నిర్వహణపై సీఎం మూర్ఖంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. స్కూళ్లలో తరగతులను తక్షణమే వాయిదా వేయాలని సూచించారు. పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం డబ్బులను సకాలంలో చెల్లించాలన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పోరాటానికి అండగా నిలవాలన్నారు. టీడీపీ హయాంలో పారిశ్రామికాభివృద్ధిలో ఏపీ నెం.1గా నిలిచిందని చెప్పారు. జగన్‌రెడ్డి హయాంలో గోవా క్యాసినో కల్చర్, పేకాట క్లబ్బులు డ్రగ్స్, గంజాయిలో ఏపీ నెంబర్ 1గా నిలిచిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.