హైదరాబాద్ జనవరి 19,
ఏదైనా ప్రభుత్వ పథకం సక్సెస్ అయితే దానిని ఇతరులు కూడా అనుకరిస్తారు. ఉదాహరణకు అమ్మ క్యాంటిన్లు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశ పెట్టగానే మిగిలిన రాష్ట్రాలు సయితం ఆ బాటలోనే పయనించాయి. ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ కు తీసుకెళ్లింది. ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ప్రజలు ఆదరించే పథకాలను ఏ రాష్ట్రం అమలు చేసినా వాటిని తమ రాష్ట్రంలో తేవడానికి సిద్దమవుతారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాటలో ఉన్నారు. నాడు - నేడు... ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే ఆయన నాడు - నేడు కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనుకున్నారు. అందుకోసం నిధులు వెచ్చించారు. పాఠశాలల మరమ్మత్తులతో పాటు అక్కడ మంచి వాతావరణం కల్పించడం వంటివి ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకున్నాయి. తాము కొన్నేళ్ల నుంచి చూసిన పాఠశాల ఇదేనా అని ఆశ్చర్య పోయే విధంగా పాఠశాలలను జగన్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇది జగన్ తీసుకున్న నిర్ణయాల్లో సక్సెస్ అయిన వాటిలో ఒకటిగా నిలిచింది. దీంతో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం మన ఊరు - మన బడి పేరుతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రి వర్గ సమావేశంలో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడానికి, మరమ్మతులు, కోసం 7,289 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకాన్ని తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇక పై కళకళలాడనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. కానీ ప్రజల్లో ఉన్న సానుకూలత కారణంగా తెలంగాణలోనూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనున్నారు. మంచి పథకం, ప్రజల ఆమోదం ఉన్న నిర్ణయాన్ని ఎవరైనా అమలు పరుస్తారనడానికి ఇదే నిదర్శనం.