YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దగా పడుతున్నా ధాన్యం రైతు

దగా పడుతున్నా ధాన్యం రైతు

రైతన్న నెత్తిన వరస దరువులు మోగుతున్నాయి. తాజాగా కొనుగోళ్ల నిబంధనల రూపంలో కొత్త కష్టం దరిచేరింది. అసలే అకాల వర్షం అతలాకుతలం చేసిన దిగాలుకు తోడుగా మరో బెంగ ఎదురవుతోంది. కొనుగోళ్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ప్రకృతి శాపానికి తోడుగా కేంద్రాల్లో వడివడిగా ఉన్న ధాన్యాన్ని కొనేందుకు అధికారులు చూపిస్తున్న నిరాసక్తి శాపంగా మారుతోంది. తడిసిన ధాన్యంతో తేమ శాతం బెడద మరింతగా కుంగదీస్తోంది. నిరీక్షణ రూపంలో ఇబ్బంది ఎదురవుతుండటంతో రైతు కడుపు రగిలిపోతోంది.

జిల్లాలో కరీంనగర్‌తోపాటు పలుచోట్ల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం కనిపించింది. కరీంనగర్‌, చొప్పదండి, గంగాధర, రామడుగు, గోపాల్‌రావుపేట మార్కెట్‌ యార్డులతోపాటు వీణవంక, ఇమ్మత్‌నగర్‌, శ్రీరాములుపేటలోని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ధాన్యాన్ని కొనే ప్రక్రియను సంబంధిత అధికారులు చేపట్టలేదు. దీంతో వందల సంఖ్యలో రైతులు తెచ్చిన ధాన్యం కుప్పల చెంతనే కాపలాగా ఉన్నారు. మరోవైపు ఆయా కేంద్రాల్లో చాలావరకు ధాన్యం నిల్వలు పేరుకుపోవడం వల్ల కూడా అధికారులు ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. కొన్న ధాన్యాన్ని తరలించడంతోపాటు తడిసిన వాటిని కొనే ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబోసుకునే వసతులు లేక అన్నదాతలు అగచాట్లు పడ్డారు. ఓ వైపు తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని ప్రభుత్వం ఆదేశాలిస్తున్నా.. కొన్ని చోట్ల అమలుకు నోచుకోవడంలేదు. తేమ ప్రభావం లేకుండా ఆరబెడితేనే కొంటామనే నిబంధనలు రైతుకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఆరబోతకు అవసరమైన సౌకర్యాలు లేక అన్నదాత అరిగోస పడాల్సిన దుస్థితి పలుచోట్ల కనిపించింది. దీనికి తోడుగా లారీల కొరతతోపాటు హమాలీల బెడద ఇతర సమస్యలు వేధించాయి. అధికారుల్ని ఇబ్బందులకు గురిచేసాయి. దీంతో  సేకరించిన బస్తాలను గోదాములకు తరలించడంలో ఆలస్యం కలుగుతోంది. ఆశతో అమ్మేందుకు తెచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తేనే అన్నదాతకు ఎదురవుతున్న ఇక్కట్లనుంచి కొంతనైనా విముక్తి లభించనుంది

కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయని తీరుపై అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి వసతుల రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులపై తీవ్రస్థాయిలో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.  ప్రతి కేంద్రానికి వందల సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తెస్తుండగా వచ్చిన ధాన్యానికి అవసరమైన మేరకు టార్ఫలిన్‌లు మాత్రం అందించలేకోయారు. దీంతో ఉన్నఫలంగా వచ్చిన వాననుంచి దిగుబడిగా వచ్చిన పంటను సంరక్షించుకునే చర్యలు లేక రైతులు చేతులెత్తాల్సిన పరిస్థితి జిల్లాలో కనిపించింది. దీనికితోడుగా ఎక్కువగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ సహా ఆరబోతకు అనువైన స్థలం లేక అగచాట్లు తప్పడంలేదు. కొన్ని గ్రామాల్లో పంటపొలాల చెంతనే వీటిని ఏర్పాటు చేయడం నేలంతా ఎగుడు దిగుడుగా ఉండటంతో చిన్నవర్షానికే నీళ్లు నిలిచాయి. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం కొనుగోలు చేసిన 5.68లక్షల క్వింటాళ్లలో ఇంకా 18వేల క్వింటాళ్లను గోదాములకు తరలించాల్సి ఉంది. కానీ వాస్తవానికి భిన్నంగా ఆయా కేంద్రాల్లో బస్తాలు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కెట్‌ యార్డుల్లోని ధాన్యాన్ని సకాలంలో తరలించడంలో లోపం కనిపిస్తోంది. ఒక్క వీణవంక మండలంలోనే 9కేంద్రాల్లో 18,720 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే అందులో 16,784 క్వింటాళ్లు లారీల్లో తరలించారు. ఇంకా 2,038 క్వింటాళ్లు కేంద్రాల పరిధిలో అలాగే ఉన్నాయి. రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఒనోలు విధానంలో మరింత వేగాన్ని చూపించాల్సిన అవసరం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. అవసరమైన చోట తూకాల సంఖ్య సహా ఇతర ఏర్పాట్లను చేపట్టాలి.

Related Posts