హైదరాబాద్, జనవరి 19,
రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. పండుగ సందర్భాల్లో మద్యం అమ్మకాలు రెండింతలు అవుతున్నాయి. డిసెంబర్ 31న పెరిగిన మద్యం అమ్మకాలు.. సంక్రాంతి పండుగకు కూడా పెరిగాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో అమ్మకాలు రెండింతలయ్యాయి. మరోవైపు గత ఏడాదిలో రూ. 52వేల కోట్ల విక్రయాలు జరుగగా.. ఈ ఏడాది తొలి నెలలోనే ఇప్పటికే రూ. 2800 కోట్లు దాటాయి.సంక్రాంతి సందర్భంగా గ్రేటర్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయి. మూడు రోజుల్లో రూ.124 కోట్లకు పైగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే అమ్మకాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.58 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరగగా హైదరాబాద్‌లో రూ.32 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడైంది. మేడ్చల్ జిల్లాలో రూ.24 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. అటు బార్లతో పాటు శివారు ప్రాంతాల్లో రూ. 10 కోట్లు దాటినట్లు అధికారులు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. కొన్నిచోట్ల జాతరలు జరుగడంతో లిక్కర్ సేల్స్ పెరిగాయి. రూరల్ ప్రాంతాల్లో ఈ మూడు రోజుల్లోనే రూ. 323 కోట్ల మద్యాన్ని అమ్మారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు.