రైతన్నకు అన్నీ కష్టాలే. సాగుబడి నుంచి మొదలెడితే.. ధాన్యం అమ్మిన సొమ్ము చేతికందే వరకూ వారు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. అన్ని కష్టాలను అధిగమించి పండించిన పంటను అమ్ముకుంటే వచ్చిన సొమ్ము అక్కరకు రాకుండా బ్యాంక్ ఖాతాలో మూలుగుతోంది. నగదు కొరత కారణంగా బ్యాంక్‌ల నుంచి డబ్బులు తీసుకొలేని పరిస్థితి ఉంది. సాగుబడి ఖర్చులు, వరికోత, హమాలీ ఛార్జీలు చెల్లించడం, కనీస అవసరాలకు ఉపయోగపడని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు నేరుగా ఆయా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో విక్రయించిన రైతులకు కూడా నగదు కొరతతో మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు చెక్కులు మాత్రమే ఇస్తున్నారు. ఖాతాలో డబ్బులు జమవుతున్నా బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో చాలిచాలని డబ్బులు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పలు ప్రాంతాల్లో మినహా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నగదు ఖాళీ అయింది. పింఛన్, ఉపాధిహామీ కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకర్లు ఉన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది.
యాదాద్రి భువనగిరితోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కొనుగోలు సంస్థల్లోనే రోజూ వేల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30 వరకు నల్గొండ జిల్లాలో 148 కేంద్రాల ద్వారా రూ.313 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ.160 కోట్లు ఆయా రైతుల అకౌంట్లలో జమ చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ 107 కేంద్రాల్లో రూ.145 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలుచేసి రూ.65 కోట్లు జమ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.98 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.30.63 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు, చెల్లింపులు కొంత మేరకు సాఫీగానే జరుగుతున్నా చిక్కంతా నగదు కొరతతోనే వచ్చింది. నగదు చేతికి రాకపోవడంతో పంట అమ్మిన రైతులకు సంతోషం లేకుండా పోయింది. వారి ఖాతాలన్నీ దాదాపు గ్రామీణ, సహకార బ్యాంకుల్లోనే ఉన్నాయి. వీటిల్లోనే నగదు కొరత తీవ్రంగా ఉంది. బ్యాంకర్లు ఒక్కోచోట రూ.10వేల నుంచి రూ.50వేల వరకు మించి ఇవ్వడంలేదు. రోజు నగదు జమ అధికంగా ఉన్న బ్యాంకుల్లో మాత్రం రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. మధ్యతరహా, పెద్ద రైతులకు మాత్రం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో చెల్లింపుల సంక్షోభం తీవ్రంగా ఉంది. భువనగిరి పట్టణంలోని ఎస్‌బీఐ లాంటి చెస్ట్ బ్యాంక్‌లోనే గరిష్ఠంగా రూ.20వేలకు మించి చెల్లించని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రాల్లో రూ.10వేలకు మించి ఇవ్వడంలేదు. ఆలేరు, అడ్డగూడూరు, మోత్కూర్ ప్రాంతాల్లో రైతులు తమ బ్యాంకుల్లో జమైన సొమ్మును తీసుకునేందుకు రోజూ చక్కర్లు కొడుతున్నారు. పండించడం, అమ్ముకోవడం ఒక ఎత్తయితే.. సొమ్ము చేసుకోవడం అంతకు మించిన భారమవుతోంది.
వరికోత యంత్రాలు, హమాలీ ఛార్జీలు, పెట్టుబడి డబ్బులు ఎలా చెల్లించాలి, వ్యక్తిగత అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చెక్కుల ద్వారా చెల్లింపులు చేసుకొమ్మని బ్యాంకర్లు ఇస్తున్న సలహాలపై రైతులు మండిపడుతున్నారు. ఖాతా నిర్వహణే కష్టమైన పరిస్థితుల్లో చెక్కులు ఎలా ఇవ్వగలమని ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రభుత్వ సంస్థల్లో ధాన్యం విక్రయించిన రైతులకు అమ్మిన మొత్తానికి ఒకే దఫాలో మొత్తం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.