విజయవాడ, జనవరి 19,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే రాజకీయాలు హీటెక్కిపోయాయి. రెండేళ్లకు ముందే పొత్తులపై చర్చ ప్రారంభమయింది. అయితే ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందా? లేక ద్విముఖ పోటీ ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన, బీజేపీ కాంబినేషన్ తోనే ఎన్నికలకు వెళితే మరోసారి త్రిముఖ పోటీ ఉంటుంది. అలా కాకుండా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ద్విముఖ పోటీ ఉంటుంది. ద్విముఖ పోటీ అయితేనే వైసీపీిని ఓడించగలమని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే వెళతారు. ఒంటరిగా వెళ్లరు. ఆయనతో జనసేన, బీజేపీ కలసి వచ్చినా రాకపోయినా కమ్యునిస్టు పార్టీలు చివరి నిమిషంలో కాంగ్రెస్ తో నైనా చంద్రబాబు కలిసే అవకాశముంది. ప్రధానంగా జనసేనతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉంది. రాష్ట్ర పరిస్థితులను బట్టి పొత్తు అవసరమని చంద్రబాబు బహిరంగంగా అంగీకరించడంతో ఆయన ఒంటరిగా పోటీ చేయడం కల్ల అన్నది స్పష్టమయిపోయింది.ఇక ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఫుల్లు క్లారిటీతో ఉన్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో మాదిరిగానే ఒంటరిగానే పోటీ చేయడానికి పార్టీని సమాయత్తం చేస్తున్నారు. తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. 175 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్ సింబల్ ఉండాలన్నది జగన్ ఉద్దేశ్యం. ఆయన ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల కోసం సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పార్టీ కూడా పొత్తుల కోసం సిద్ధమవుతున్నారు. ఆయన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోట ీచేసే బలం లేదు. బలగం లేదు. దీంతో ఆయన పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ టీడీపీతో కూడా కలిసి నడిచేందుకు ప్రయత్నిస్తుంది. జగన్ ను ఓడించాలంటే ఇదొక్కటే మార్గమని, 2014 ఫార్ములాయే బెటర్ అని పవన్ కల్యాణ్ విశ్వసిస్తున్నారు. అయితే బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే ఆసక్తి లేదు. ఆశలేదు. అందుకే టీడీపీతో కలసి నడిచేందుకు బీజేపీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.