జగిత్యాల జనవరి 19
జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రానికి చెందిన అనుపురపు శ్రీనివాస్ గౌడ్ (50) అనే వ్యక్తి మూడేండ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసి, అసభ్యకరంగా వేధించి, హింసించాడని బాధిత చిన్నారి తల్లి బుధవారం జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేసింది. అనంతరం విలేఖరులతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడారు. ఈనెల 14న శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని, స్థానిక బుగ్గారం పోలీసులకు పిర్యాదు చేసినా నిందితుడిపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. వైద్య పరీక్షల కోసమని, పాప ను విచారించడం కోసం అని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి, మల్యాల, పెగడపల్లి పోలీస్ స్టేషన్ లకు రెండు రోజుల పాటు అర్ధ రాత్రి 2:30గంటల దాకా పోలీసులు మమ్మల్ని తిప్పినారని బాధను వ్యక్తపరిచారు. ఎక్కడికి తీసుకుపోయి విచారించినా చిన్నారి మూడేండ్ల పాప తన పై జరిగిన అఘాయిత్యాన్ని జరిగింది జరిగినట్లు కండ్లకు కట్టినట్లుగా వివరించి చెప్పిందని తెలుపుతూ వారు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లే తీసుకొని పోలీసులు వదిలిపెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో నిందితుడు, ఆయన సమీప బంధువులు, ఆయన కుటుంబీకులు రెచ్చిపోతున్నారని, మా అంతు చూస్తామని, మా సంగతి చూస్తా మని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పెట్టవద్దని, ఫిర్యాదు వాపస్ తీసుకోవాలని ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాకు ప్రాణ భయం ఉందని, న్యాయం చేసి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.